మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మళయాళంలో హిట్ అయిన లూసీఫర్ సినిమాకు రీమేక్‌గా గాడ్ ఫాదర్ వచ్చింది. సినిమాకు ఓకే టాక్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా రు. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా… రు. 53 కోట్ల షేర్ కొల్లగొట్టింది. అయితే ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే సరికి వసూళ్లు మాత్రం వీక్ అయ్యాయని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో గాడ్ ఫాదర్ సక్సెస్ అనేది అందరిది అంటూ చెప్పారు.
ఈ కామెంట్‌పైనే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సినిమా కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేశారని… దీంతో ఈ సినిమా సక్సెస్ అయ్యిందని చిరు చెప్పారు. అయితే ఇటీవల ఆచార్య సినిమా ఫలితం అంతా దర్శకుడు కొరటాల శివకే దక్కుతుందని చిరు కామెంట్ చేశారు. అసలు ఆచార్య రిలీజ్ అయినప్పటి నుంచి చిరు పదే పదే కొరటాలను ఏదో ఒక విధంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
ఆచార్య పరాజయాన్ని నూటికి నూరు శాతం కొరటాల ఖాతాలో వేసేసిన చిరంజీవి… గాడ్ ఫాదర్ సక్సెస్‌ను మాత్రం అందరి ఖాతాలో వేయడాన్ని ఇండస్ట్రీలో చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. సక్సెస్ వస్తే ఆ క్రెడిట్ అందరికి ఇచ్చిన చిరు.. ప్లాప్‌ను మాత్రం కేవలం దర్శకుడి ఖాతాలో వేస్తే ఎలా ? అని ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి లాంటి గ్రేట్ హీరో ఇలా చేయడం ఏంటా ? అని చాలా మంది ఫీలయ్యారు.
సినిమా హిట్‌లో హీరోకు ఎంత బాధ్యత ఉంటుందో ? ప్లాప్‌నకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. అయితే చిరు మాత్రం ఆచార్య ప్లాప్‌నకు తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పేస్తున్నారు. వాస్తవంగా ఈ కథ విని ఓకే చేసుకున్నది ఆయనే. ఆ తర్వాత ఆయన వేలు పెట్టడం వల్లే కథలో మార్పులు జరిగాయన్న టాక్ కూడా ఉంది. ఇక నిన్నటికి నిన్న ఆచార్య ప్లాప్ బాధ్యత కొరటాల మీద పెట్టేసి ఇప్పుడు గాడ్ ఫాదర్‌ను అందరి ఖాతాలో వేయడం చిరుకు సరికాదనే ఎక్కువ చర్చ నడుస్తోంది.