తెలుగులో తక్కువ సినిమాల్లోని నటించినప్పటికీ అందరికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించిన హీరోయిన్ ప్రియా రామన్. ఈ అమ్మడిని శుభసంకల్పం సినిమాలో చూసి అందరూ తెగ ముచ్చట పడిపోయారు. ఆ తర్వాత తెలుగులో మరిన్ని సినిమాలో నటిస్తుందని భావించినప్పటికీ చాలా తక్కువ సినిమాలతోనే అలరించింది. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో కొన్నాళ్లపాటు బిజీ హీరోయిన్ గా ఉన్న ప్రియా రామన్ తర్వాత తమిళ ఇండస్ట్రీలో డెబ్యూ చేసింది. రజనీకాంత్ సొంత ప్రొడక్షన్లో తీసిన మొదటి సినిమాలో ప్రియా రామన్ హీరోయిన్ గా తొలుత నటించింది.
అప్పటినుంచి నేటి వరకు ఆమె బిజీ ఆర్టిస్ట్ గానే కొనసాగుతోంది. సినిమాల్లో కాస్త వెనుకబడినా… టీవీ సీరియల్స్ లలో, రియాలిటీ షోలతో అభిమానులను కనువిందు చేస్తుంది. ఇక సినిమా జీవితంలో ఆమె పెద్దగా కాంట్రవర్షియల్ కాకపోయినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ వివాదాలే కనిపిస్తూ ఉన్నాయి. 1999లో తమిళ నటుడు అయిన రంజిత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియా రామన్. నేశం పుడుచు అనే సినిమాలో నటిస్తున్న క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పెళ్లయి నాలుగేళ్లు తిరగకుండానే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రంజిత్ కి విడాకులు ఇచ్చింది ప్రియ. ఇక రంజిత్ సైతం ఆ తర్వాత రాగ సుధా అనే మరో నటిని పెళ్లాడాడు. ఈ జంటకి ఒక కూతురు కూడా పుట్టింది. ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్ళీ 2018లో ప్రియ – రంజిత్ మరోమారు పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. రంజిత్ – ప్రియా రామన్ మధ్య మళ్లీ ప్రేమ చిగురించింది.
ప్రియా రామన్ – రంజిత్ మధ్య గొడవలు రావడానికి ముఖ్య కారణం డబ్బు అని తెలుస్తుంది. ప్రియా మలయాళ, తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రంజిత్ కి సినిమా అవకాశాలు తగ్గాయి. దాంతో సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఆలోచనతో నిర్మాతగా కూడా మారాడు. అయితే కోట్ల రూపాయలని సినిమాల్లో ఇన్వెస్ట్ చేసి అన్ని కోల్పోవడంతో వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలే ఏకంగా వీరి విడాకులు తీసుకోవడానికి కూడా కారణంగా మిగిలాయి.
ఒకానొక సమయంలో వీరి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి కూడా తలెత్తింది. దాంతో విడాకులు తీసుకోక తప్పని పరిస్థితి వచ్చిందట. అయితే విడాకులకు పూర్తి బాధ్యత తనదేనని ప్రియా రామన్ తన పాత ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. తన భర్త నుంచి తను దూరంగా ఉండలేకపోయానని అందుకే ఏడేళ్ల తర్వాత మళ్లీ అతని పెళ్లి చేసుకున్నానని, ప్రస్తుతం జీవితం ఎంతో బాగుందని సోషల్ మీడియాలో తమ పెళ్లిరోజు ఫోటోలను అప్లోడ్ చేసి అభిమానులకి తాము మళ్లీ కలిసాము అనే చెప్పింది.
ఇండస్ట్రీలో షూటింగ్ లొకేషన్లో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న చాలామంది నటీనటులు ఉన్నారు. అలాగే విడిపోయిన నటీనటులు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ ఇలా డబ్బుపై ప్రేమతో మొదట్లో విడాకులు ఇచ్చినా, చివరికి భర్త ప్రేమతో మళ్ళీ కలవడం కేవలం ప్రియ రామాన్ కే చెల్లింది.