ఎన్టీఆర్ జీవితంలో డైరెక్టర్ కావాలనేది అసలు కోరిక కాదు. తను నటుడిగానే ఇష్టపడేవారు. ఇటీవల ఆయన కుమారుడు, బాలకృష్ణ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. డైరెక్షన్‌లోకి వెళితే.. నటుడిగా దెబ్బతింటాననేది ఆయన ఉద్దేశం. అయితే, అప్పటి ప్రముఖ దర్శకులు సి. పుల్లయ్య వంటివారు మాత్రం ఎన్టీఆర్‌ను దర్శకుడిగా ప్రోత్సహించేవారు. అయితే, ఎన్టీఆర్ మాత్రం తనను నటుడిగానే కొనసాగనివ్వాలని కోరేవారు. ఇలా చాలా ఏళ్లు గడిచి పోయాయి. ఈ క్రమంలో అన్నగారి సోదరుడు త్రివిక్రమరావు ఎంట్రీ ఇచ్చారు.
ఈయన సినీరంగంలోకి వస్తూనే స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా వచ్చారు. అన్నగారి ఆశీర్వాదంతో అడుగులు పెట్టిన ఆయన తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకు న్నారు. ఈ లోగో సొంత ఊళ్లో పొలం అమ్మగా వచ్చిన సొమ్ముతో ఒక సినిమా తీయాలని అనుకున్నారు. దీనికి ముందే ఎన్ ఏటీ సంస్థను ఏర్పాటు చేసి.. సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే వారు. దీనిలోనూ లాభాలు బాగానే ఆర్జించారు.
ఇలా ఎదుగుతున్న క్రమంలో త్రివిక్రమరావే సొంతగా సినిమాలు చేయాలని నిర్ణయించారు. దీనికి పెద్ద పెద్ద దర్శకులను సంప్రదించారు. అయితే, వారు చెప్పిన బడ్జెట్‌కు, తనదగ్గర ఉన్న సొమ్ములకు మధ్య తేడా రావడంతో ఆపేసుకున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ జోక్యం చేసుకుని మనమే సినిమా తీద్దాం తమ్ముడూ.. అంటూ..గులేబకావళి కథ సినిమాకు తెరదీశారు.
దీనిలో ఎక్కువ మందిని కొత్తవారిని నియమించుకున్నారు. దీంతో ఖర్చు సగం తగ్గిపోయింది. షూటింగ్ కూడా ఎక్కువగా స్టూడియోలోనే అంటే ఇండోర్‌లోనే తీసేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రతి ఖర్చునూ ఆచి తూచి చేసేవారు. ఈ సినిమా పూర్తయ్యే సరికి పది లక్షలు ఖర్చవుతుందని అనుకున్నా ఇది రు. 8 లక్షల్లోనే పూర్తయింది. దీంతో అప్పటినుంచి అన్నగారే దర్శకుడుగా మారి సినిమాలు చేయడం ప్రారంభించారు.