నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌ను ఓ రేంజ్‌లో నిలబెట్టిన దర్శకుల్లో బి. గోపాల్ ఒకరు. గోపాల్, బాలయ్య కాంబినేషన్లో ఐదు సినిమాలు వస్తే అందులో నాలుగు సూపర్ హిట్లు. రెండు ఇండస్ట్రీ హిట్లు. వీరి కాంబోలో 1990వ దశకంలో ముందుగా లారీడ్రైవర్ సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత రెండేళ్లకు రౌడీఇన్‌స్పెక్టర్ వచ్చింది. అది కూడా సూపర్ హిట్. తర్వాత ఏడేళ్ల పాటు వీరి కాంబినేషన్ కుదర్లేదు.
1999 సంక్రాంతి కానుకగా వచ్చిన సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్. విజయేంద్రప్రసాద్ కథకు.. బి.గోపాల్ టేకింగ్ తోడవ్వడంతో సమరసింహారెడ్డి అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులకు పాతరేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత రెండేళ్లకు 2001 సంక్రాంతి కానుకగా వచ్చిన నరసింహానాయుడు సినిమా అయితే ఏకంగా 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. భారతదేశ సినీ చరిత్రలో ఓ హీరో నటించిన సినిమా 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడడం అదే ఫస్ట్ టైం.
ఆ తర్వాత బాలయ్య, గోపాల్ కాంబోలో ఐదో సినిమాగా పలనాటి బ్రహ్మనాయుడు వచ్చింది. ఈ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. అయితే లారీడ్రైవర్ సినిమా షూటింగ్ టైంలో బాలయ్య, గోపాల్‌పై అలిగి కొద్ది రోజులు మాట్లాడలేదు. ఇందుకు కారణం ఉంది.. తప్పు కూడా తమ వైపే ఉందని గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముందుగా బాలయ్యకు చెప్పిన కథ కాకుండా మార్చి వేరే సీన్లు తీశారు.
ఆ సీన్లు షూటింగ్ చాలా వరకు పూర్తయ్యే సరికి కాని బాలయ్యకు తనకు చెప్పని సీన్లు తీస్తున్నారన్న విషయం అర్థం కాలేదు. అయితే కలెక్టర్‌గా ఉన్న శారద కామెడీ చేయడం సరికాదని చర్చించుకున్న పరుచూరి సోదరులు ఇద్దరు వేర్వేరు వెర్షన్లు రాశారు. ఆ తర్వాత గోపాల్ కూడా ఆలోచనలో పడి కలెక్టర్‌తో కామెడీ చేయించడం కరెక్ట్ కాదని.. కొన్ని సీన్లలో మార్పులు చేశారు. ఇదంతా బాలయ్యకు ముందుగా చెప్పకపోవడంతో ఆయన గోపాల్‌పై అలిగారు.
తర్వాత కొద్ది రోజుల పాటు గోపాల్‌తో షూటింగ్ స్పాట్లో కూడా మాట్లాడేవారు కాదట. అయితే ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ అసలు విషయాన్ని బాలయ్యకు చెప్పడంతో అవునా… అని తర్వాత గోపాల్‌తో మాట్లాడడం స్టార్ట్ చేశారట. అలా చిన్న చిన్న అరమరికలు ఉన్నా బాలయ్య వెంటనే వాటిని మర్చిపోతారని గోపాల్ చెప్పారు.