పాత్ర ఏదైనా అందులో ఇట్టే ఒదిగిపోయి నటించడం నటసింహం బాలకృష్ణ నైజం. ఆయన తన కెరీర్‌లో ఇప్పటి వరకు 106 సినిమాల్లో నటించారు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ బాలయ్యకు 106వ సినిమా. మలినేని గోపీతో చేసేది 107వ సినిమా అవుతుంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 48 ఏళ్ల సినీ కెరీర్‌లో బాలయ్య వంద సినిమాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు తరం హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటుతున్నా 30 సినిమాలు చేయడమే గగనం అవుతోంది.
అలాంటిది బాలయ్య ఇన్నేళ్లలో ఏకంగా సెంచరీ దాటేసి…62 ఏళ్ల వయస్సు వచ్చినా నాటౌట్‌తో దూసుకుపోతున్నాడు. బాలయ్య బాల్యమంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఆయన నిజాం కాలేజ్‌లో డిగ్రీ చదువుకున్నారు. ఆయన బి.ఏ చదివారు. బాలకృష్ణ తన పేరుతోనే ఏడు సినిమాల్లో నటించారు. ఈ ఏడు సినిమాల్లోనూ హీరో పేరు కూడా బాలకృష్ణే కావడం విశేషం. ఇక బాలయ్య నటించిన 35 సినిమాలకు పరుచూరి బ్రదర్స్ ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పనిచేశారు.
బాలయ్య పని చేసిన దర్శకుల్లో కోదండ రామిరెడ్డి, కె. రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, బి. గోపాల్, బోయపాటి శ్రీనులతో చేసిన సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టడంతో పాటు ఆయన కెరీర్‌ను నిలబెట్టాయి. బాలయ్య నటించిన నరసింహానాయుడు సినిమా 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. భారతదేశ సినీ చరిత్రలో ఫస్ట్ టైం 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా ఇది రికార్డులకు ఎక్కింది. ఈ అరుదైన ఘనత బాలయ్యకే దక్కింది.