టాలీవుడ్ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన కెరీర్ మొత్తం మీద 187 సినిమాల్లో నటించిన కృష్ణంరాజు ప్రారంభంలో విలన్ పాత్రలు వేశారు. అంతకుముందు జర్నలిస్టుగాను పనిచేశారు. 1966 లో వచ్చిన చిలకా గోరింక సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయన చివరిసారిగా ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్ సినిమాలో పరమహంస పాత్రలో నటించారు.
ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణంరాజు వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన క్షత్రియ వంశానికి చెందిన వారు కృష్ణంరాజు. ఇక కృష్ణంరాజు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు అన్న సంగతి చాలా మందికి తెలియదు. కృష్ణంరాజు మొదటి భార్య ఎవరు ? ఆయన ఎందుకు రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్నది తెలుసుకుందాం.
కృష్ణంరాజు ముందుగా సీతాదేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కృష్ణంరాజు సీతాదేవి దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి మృత్యువు యాక్సిడెంట్ రూపంలో వచ్చింది. కృష్ణంరాజు భార్య సీతాదేవి ఒక రోడ్డు ప్రమాదంలో 1995లో మృతి చెందారు. అలా కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి మరణించడంతో అప్పుడు ఆయన శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే కృష్ణంరాజు శ్యామలాదేవి దంపతులకు మరో ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఈ ముగ్గురు కుమార్తెలతో పాటు మొదటి భార్య కుమార్తె కాకుండా మరో అమ్మాయిని కూడా కృష్ణంరాజు దంపతులు దత్తత తీసుకున్నారు. ఇలా ఐదు మంది ఆడపిల్లలకు కృష్ణంరాజు దంపతులు తల్లిదండ్రులుగా మారిపోయారు. ఇక కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి కుమార్తెకు ఇప్పటికీ వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. అయితే కృష్ణంరాజు రెండో భార్య శ్యామలాదేవి తన కుమార్తె కాకపోయినా కృష్ణంరాజు పెద్ద భార్య కుమార్తెను సొంత కూతురుగా పెంచారు.
ఇక కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ రాజు కుమారుడే మన టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ బాహుబలి సినిమాల తర్వాత ఏకంగా జాతీయస్థాయిలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.