సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో గత కొద్ది రోజులుగా వరుసగా విషాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. తాజాగా కృష్ణ మొదటి భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సైతం అనారోగ్యంతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కొన్నేళ్ల ముందు కృష్ణ రెండో భార్య ప్రముఖ నటి విజయనిర్మల సైతం మృతి చెందారు. ఇలా వరుసగా కృష్ణ ఫ్యామిలీని విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మృతి చెందిన ఇందిరా దేవి ఎవరో కాదు కృష్ణకు స్వయానా మేనమామ కుమార్తె. వీరి స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని ముసళ్లమడుగు.
మామూలుగా కృష్ణ సినీ రంగంలో సూపర్‌స్టార్‌గా ఉండడంతో కృష్ణ భార్య అనగానే మనకు విజయనిర్మలే గుర్తుకు వస్తారు. విజయనిర్మల కృష్ణకు రెండో భార్య. అప్పటికే ఆమెకు మరో వ్యక్తితో పెళ్లయ్యి నరేష్ కూడా పుట్టేశాడు. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో ఉండడం, కృష్ణతో చనువుగా ఉన్న నేపథ్యంలో భర్తతో విబేధాలు రావడంతో విడాకులు ఇచ్చేసి అధికారికంగానే కృష్ణను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి తిరుపతిలో ఇద్దరు, ముగ్గురు కృష్ణ సన్నిహితుల సమక్షంలో సీక్రెట్‌గా జరిగింది.
కృష్ణకు కుటుంబ సభ్యులు సినిమాల్లోకి రాకముందే ఇందిరాదేవితో వివాహం జరిపించారు. కృష్ణ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఆయన ఎక్కువుగా జయప్రద, విజయనిర్మలతో సినిమాలు చేసేవారు. జయప్రద – కృష్ణ మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవన్న ప్రచారం జరిగింది. అయితే జయప్రద కేవలం కృష్ణకు జోడీగా సినిమాల్లో హీరోయిన్‌గా మాత్రమే చేసేవారు. అయితే విజయనిర్మలతో ఆయనకు అంతకు మించిన అనుబంధం ఏర్పడిపోయింది.
కృష్ణ హీరోగా చేసిన కొన్ని సినిమాలకు విజయనిర్మల దర్శకత్వం వహించారు. ఆ టైంలోనే విజయనిర్మలతో కృష్ణ సన్నిహితంగా ఉంటున్నారన్న విషయం ఇందిరకు తెలిసినా ఏం చేయలేదనే అంటారు. ఇందిర ఇంటి వద్దే ఉంటారు. కృష్ణ అవుట్ డోర్లో ఉన్నప్పుడే విజయనిర్మలే దగ్గరుండి సపర్యలు చేయడంతో పాటు ఆరోగ్యం చూసుకునేది. ఆ తర్వాత కృష్ణ సడెన్‌గా తిరుపతిలో విజయనిర్మలకు తాళి కట్టి రెండో భార్యను చేసుకున్నప్పుడు మాత్రం ఇందిరకు మనసులో బాధ ఉన్నా బయట పెట్టలేదనే అంటారు.
కొద్ది రోజుల పాటు భర్తతో స్పర్థలు వచ్చాయనే అంటారు. ఆ తర్వాత మాత్రం ఇందిర విజయనిర్మలను బాగా చూసుకునేవారని… తన భర్తను ఎంతో ఆప్యాయతతో చూసుకోవడం ఇందిరకు కూడా నచ్చేదని అంటారు. అయితే ఇందిర బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం అయ్యేవారు. ఇండస్ట్రీలో అన్ని ఫంక్షన్లకు, ఇతర ఫంక్షన్లకు కృష్ణ, విజయనిర్మలే కలిసి వచ్చేవారు.