విజయ్ దేవరకొండతో పాటు పూరి జగన్నాథ్ లైగర్ సినిమాను ఓ రేంజ్లో ప్రమోట్ చేశారు. అసలు లైగర్ రిలీజ్ అయ్యాక అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఇది పెద్ద హాట్ టాపిక్ అవుతుందని బల్లగుద్ది చెప్పినంత పని చేశారు. ఇక ఛార్మీ సరేసరి. కట్ చేస్తే లైగర్ డిజాస్టర్ అయ్యింది. అసలు ఈ సినిమా గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. కొందరు అయితే మోహన్‌బాబు సన్నాఫ్ ఇండియా సినిమా వసూళ్లతో లైగర్ పోటీ పడుతోందంటూ నెట్టింట్లో సెటైర్లు వేస్తున్నారు.
దీనిని బట్టే ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిపోయిందో క్లారిటీ వచ్చేసింది. టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో స్టార్ హీరో రేంజ్‌కు వెళ్లిపోతోన్న క్రమంలో విజయ్‌కు లైగర్ రూపంలో బిగ్గెస్ట్ ప్లాప్ వచ్చింది. ఇప్పటికే ప్లాపుల్లో ఉన్న విజయ్‌కు లైగర్ పెద్ద గుదిబండలా మారింది. ఇక నిన్నటితో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకోవడంతో లైగర్‌ను చాలా చోట్ల ఎత్తేశారు.
లైగర్ సినిమా ప్లాప్ అయ్యింది.. అయితే ఇండస్ట్రీలోనే కొందరు కావాలని ఈ సినిమా రిలీజ్ ముందు నుంచే ప్లాప్ అని బాగా ప్రచారం చేశారు. విజయ్ను గుచ్చి గుచ్చి మరీ టార్గెట్ చేస్తూ లైగర్‌కు కావాల్సినంత నెగటివ్ టాక్ అయితే తీసుకువచ్చారు. అయితే అది ఈ సినిమాతో ఆగేట్టు లేదు. ఇప్పుడు విజయ్ నెక్ట్స్ సినిమా ఖుషిని కూడా కొందరు టార్గెట్ చేసే పనిలో ఉన్నారట.
విజయ్ దేవరకొండ – సమంత కాంబినేషన్లో ఫస్ట్ టైం తెరకెక్కుతోన్న ఈ లవ్ ఎంటర్టైనర్ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది. అయితే ఇప్పుడు ఖుషి సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అఖిల్ ఏజెంట్ అదే టైంకు వస్తే ఖుషీని వాయిదా వేయక తప్పదని అంటున్నారు. ఇప్పటికే లైగర్ తాలూకూ ఎఫెక్ట్ ఆ సినిమాపై ఉంటుంది. దీనికి తోడు ఈ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ టక్ జగదీష్ లాంటి ప్లాపు తర్వాత చేస్తోన్న సినిమా ఇది.
దీనికి తోడు ఖుషీ అనేది పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ టైటిల్. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడే పవన్ ఫ్యాన్స్ నుంచి యాంటీ వచ్చింది. ఇక ఇప్పుడు విజయ్ను టార్గెట్ చేసే గ్యాంగ్ కూడా కాచుకుని ఉన్నారు. ఇందులో కొందరు హీరోల అభిమానులు, కొన్ని కాంపౌండ్ల గ్యాంగ్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో విజయ్ ఈ నెగటివ్‌లను ఎదుర్కొని ఖుషీతో ఎలా గట్టెక్కుతాడో ? చూడాలి.