బ్యానర్: ఐరా క్రియేషన్స్
టైటిల్: కృష్ణ వ్రింద విహారి
నటీనటులు: నాగ శౌర్య, షిర్లే సెటియా, రాధికా శరత్‌కుమార్, వెన్నెల కిషోర్, తదితరులు
ఎడిటర్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్
మ్యూజిక్: మహతి స్వరసాగర్
నిర్మాత: ఉషా ముల్పూరి
దర్శకత్వం : అనీష్ ఆర్. కృష్ణ
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 23, 2022
యంగ్ హీరో నాగశౌర్యకు కావాల్సినంత టాలెంట్ ఉంది. మంచి కథలతో సినిమాలు వచ్చినా ఎందుకోగాని కమర్షియల్‌గా తన రేంజ్‌కు తగ్గ హిట్ అయితే రాలేదు. ఛలో తర్వాత అదే రేంజ్ బ్లాక్‌బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరోసారి తన సొంత బ్యానర్లో తెరకెక్కిన మూవీ కృష్ణ వ్రింద విహారి. టీజర్లు, ట్రైలర్లతో మంచి ఫన్ సినిమాగా అంచనాలే ఏర్పడ్డ ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి కృష్ణ, వ్రింద ఏం మ్యాజిక్ చేశారో TL సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
కృష్ణ (నాగశౌర్య) సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. తన కుటుంబంలో ఎన్నో కట్టుబాట్లుతో పెరిగిన కృష్ణ… తన ఫ్యామిలీ సంప్రదాయాలకు రివర్స్‌లో పద్ధతుల్లో పెరిగిన మోడ్రన్ గర్ల్ వృంద ( షెర్లీ సెటియా)ను లవ్ చేస్తాడు. ఆమెకు కూడా కృష్ణ అంటే ఇష్టం. అయితే తనకు పిల్లలు పుట్టరన్న కారణంతో అతడిని దూరం పెడుతూ వస్తూ ఉంటుంది. అయితే తనకు పిల్లలు అవసరం లేదని.. ఆమెతో పాటు ఇంట్లో వాళ్లను కన్విన్స్ చేసి మరీ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇలాంటి టైంలో కృష్ణ తల్లి సిటీలో అతడి ఇంటికి రావడంతో అక్కడ సమస్యలు స్టార్ట్ అవుతాయి. మరి ఆ సమస్యల వల్ల కృష్ణ, వృంద బంధంపై ఎలాంటి ప్రభావం పడిందన్నదే సినిమా కథ.
విశ్లేషణ :
ఈ సినిమాలో మంచి పాయింట్ ఉంది… కావాల్సినంత ఫన్ ఉంది. అయితే బలమైన కథనం లేకపోవడంతో సినిమా ఎక్కడికో వెళ్లాల్సింది జస్ట్ ఓకే అన్నట్టుగా అనిపిస్తుంది. సినిమాలో కామెడీ, రొమాన్స్ కావాల్సినంత ఉండేలా చూసుకున్నాడు. హీరోయిన్‌కు పిల్లలు పుట్టరని తెలిసినా.. హీరో ఆ లోపం తనలో ఉందని చెప్పి పెళ్లికి ఒప్పించడం లాంటి కథలు గతంలోనే చూశాం. నాని అంటే సుందరానికీ సినిమాలో ఇలాంటి లైనే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలోనూ అదే పాయింట్‌తో కథను నడిపించాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారసులు పడే ఇబ్బందులు.. అయితే నాని సినిమాలో తండ్రి ఇబ్బంది పెడితే.. ఈ సినిమాలో ఆ బాధ్యత అమ్మ తీసుకుంటుంది. అక్కడా ఇక్కడా బామ్మ క్యారెక్టర్ యధావిధిగా ఉంటుంది.
సినిమా లైన్ రొటీన్‌గా ఉన్నా కూడా మనకు ఎక్కడా బోర్ కొట్టకుండా సన్నివేశాలు ముందుకు కదులుతూ ఉంటాయి. కావాల్సినంత ఫన్‌తో పాటు హీరో శౌర్య క్యారెక్టర్ కొత్తగా ఉండడం, ఇటు హీరోయిన్ ఫ్రెష్ ఫీల్ బాగున్నాయి. హీరో, హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలతో పాటు జంట స్క్రీన్ మీద చూడముచ్చటగా ఉంది. హీరో, హీరోయిన్ల రొమాన్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, వెన్నెల కిషోర్ కామెడీతో ఫస్టాఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు.
అయితే సెకండాఫ్‌లో ఫ్యామిలీ డ్రామా కాస్త మితిమీరినట్టుగా ఉంటుంది. అత్తా కోడళ్ల గొడవ మనం చాలా సినిమాల్లో చూసిందే. కొన్ని సీన్లు సీరియల్స్‌లో ఉన్నట్టు ఉన్నా కూడా ఇక్కడా సినిమాను కామెడీయే నిలబెట్టింది. నటీనటులు అందరూ తమ పాత్రల వరకు బాగానే చేశారు. ఓవరాల్‌గా కృష్ణ వ్రింద మరీ కొత్త సినిమా కాకపోయినా కాలక్షేపానికి అయితే లోటు ఉండదు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్ :
ఈ సినిమాకు సరైన పాటలు పడలేదు. పాటలు గుర్తుండేలా ఉంటే సినిమా రేంజ్ ఎక్కడో ఉండేది. మేకర్స్ పాటలపై దృష్టి పెట్టకపోవడం సినిమా రేంజ్‌ను తగ్గించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు సింపుల్‌గానే ఉన్నాయి. నాగశౌర్య సొంత సినిమా కావడంతో నిర్మాణ విలువలకు డోకా లేదు. సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. ఫ్రేములు చాలా వరకు కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ రన్ టైం తక్కువ కావడంతో ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. దర్శకుడు అనీష్ కృష్ణ పాత లైనే తీసుకున్నా సినిమాను కావాల్సినంత ఫన్‌తో నడిపించేశాడు. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ ఫన్‌తో సినిమాను నడిపించడం బాగుంది. అయితే ఫ్యామిలీ ఎమోషన్లు ఆశించే వారికి డిజప్పాయింట్‌మెంట్ తప్పదు.
ఫైనల్‌గా…
మొత్తంగా కృష్ణ వ్రింద విహారి సినిమాలో మెయిన్ లీడ్, ప్రెష్ పెర్పామెన్స్‌తో పాటు కావాల్సినంత ఫన్ దొరుకుతుంది. అయితే సినిమాలో రొమాన్స్, కామెడీ ఉండడంతో ఎంజాయ్ చేయడానికి బాగున్నా ఎమోషన్లు కనపడవు. ఈ వారాంతంలో ఈ సినిమా మంచి ఫన్ అయితే ఇస్తుంది. యూత్‌తో పాటు ఫన్ ఇష్టపడే వారు బాగా ఎంజాయ్ చేయవచ్చు.
కృష్ణ వ్రింద విహారి TL రేటింగ్ : 3 / 5