MoviesTL రివ్యూ: బ్ర‌హ్మాస్త్రం ( తెలుగు)

TL రివ్యూ: బ్ర‌హ్మాస్త్రం ( తెలుగు)

టైటిల్‌: బ్ర‌హ్మాస్త్రం
నటీనటులు: అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని
మ్యూజిక్‌: సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్
నిర్మాతలు: కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, డిసౌజా, అయాన్ ముఖర్జీ
దర్శకత్వం : ఆయాన్ ముఖ‌ర్జీ
ర‌న్ టైం: 167 నిమిషాలు
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
రిలీజ్ డేట్‌: 09, సెప్టెంబ‌ర్ 2022

గ‌త కొంత కాలంగా బాలీవుడ్‌లో వ‌స్తోన్న భారీ బ‌డ్జెట్ సినిమాలు తుస్సుమ‌నిపిస్తున్నాయి. ఓ వైపు సౌత్ సినిమాలు దండ‌యాత్ర దెబ్బ‌తో బాలీవుడ్ షేక్ అవుతోంది. అమీర్‌ఖాన్‌, అక్ష‌య్‌కుమార్ లాంటి పెద్ద హీరోల సినిమాల‌నే రిజెక్ట్ చేసిన బాలీవుడ్ ప్రేక్ష‌కులు మ‌న కుర్ర హీరో నిఖిల్ కార్తీకేయ 2ను బ్లాక్‌బ‌స్ట‌ర్ చేశారు. ఇలాంటి స‌మ‌యంలో బ్ర‌హ్మాస్త ఖ‌చ్చితంగా బాలీవుడ్ ప‌రువు నిలబెడుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ్ర‌హ్మాస్త్ర మొదటి భాగం శివ మ‌రి ఆ ఆశ‌లు, అంచ‌నాలు ఎంత వ‌ర‌కు నిల‌బెట్టుకుందో TL స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
సకల అస్త్రాలకు దేవత బ్రహ్మాస్త్ర. దీనిని కొంద‌రు వ్య‌క్తులు కాపాడుతూ ఉంటారు. బ్ర‌హ్మాస్త్ర మూడు ముక్క‌లుగా ఉంటుంది. ఈ మూడు ముక్క‌ల్లో ఒక‌టి సైంటిస్ట్ మోహ‌న్ భార్గ‌వ్ (షారుఖ్‌ఖాన్‌), రెండోది ఆర్టిస్ట్ అనీష్ శెట్టి ( నాగార్జున‌) ద‌గ్గ‌ర ఉంటుంది. మూడోది ఎక్క‌డ ఉంటుందో తెలియ‌దు. అయితే బ్ర‌హ్మాస్త్ర‌ను వ‌శం చేసుకునేందుకు దేవ్‌కు చెందిన మ‌నుషులు ( మౌనీరాయ్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ) ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్ర‌య‌త్నాలు అడ్డుకునే క్ర‌మంలో మోహ‌న్ భార్గ‌వ్‌, అనీష్ శెట్టి మ‌ర‌ణిస్తారు. అయితే అప్పుడు దేవ్ మ‌నుష్యుల‌ను ఓ డీజే శివ ( ర‌ణ‌బీర్‌క‌పూర్) ఎలా అడ్డుకున్నాడు.. అత‌డికి ప్రేయ‌సి ఇషా ( ఆలియా భ‌ట్‌) ఎలా సాయం చేసింది ? చివ‌ర‌కు శివ తాను అగ్ని అస్త్రం అని తెలుసుకునే క్ర‌మంలో గురు ( అమితాబ‌చ్చ‌న్ ) పాత్ర ఏంట‌న్న‌దే ఈ సినిమా స్టోరి.

 

విశ్లేష‌ణ :
దైవ శ‌క్తికి, దుష్ట‌శ‌క్తికి మ‌ధ్య జ‌రిగే యుద్ధంలో గెలుపు ఎప్పుడూ దైవ‌శ‌క్తితే అవుతుంది. అయితే బ్ర‌హ్మాస్త్ర అలాంటి సినిమాయే అయినా సినిమాలో ఆస‌క్తి క‌లిగించే సీన్లు ఎన్ని ఉన్నాయ‌నుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి. ద‌ర్శ‌కుడు ఆయాన్ ఎంపిక చేసుకున్న లైన్ బాగున్నా.. దానిని చిక్క‌టి క‌థ‌గా మ‌ల‌చ‌లేదు. ఇక ప్రేమ‌క‌థ‌తో సినిమాను సైడ్ ట్రాక్ కూడా ప‌ట్టించాడు. పైగా క్లైమాక్స్‌లో ప్రేమ‌ను మించిన బ్ర‌హ్మాస్త్రం లేద‌ని అమితాబ్‌తో ఓ డైలాగ్ చెప్పిస్తాడు. ఇందుకోస‌మేనా ? సినిమా తీసింది ? అని చివ‌ర్లో అనిపిస్తుంది. అస‌లు ర‌ణ‌బీర్ తాను ఫైర్ అని తెలుసుకునే సీన్ల‌లో ఫైరే ఉండ‌దు. ఈ సినిమాకు మ్యూజిక్ బిగ్గెస్ట్ మైన‌స్ పాయింట్‌. అస‌లు అఖండ సినిమాకు మ్యూజిక్ ఎంత ప్ల‌స్ అయ్యిందో చూశాం. ఈ సినిమాను మ్యూజిక్ ముంచేసింది.

ఈ సినిమాను తెలుగు సంగీత ద‌ర్శ‌కుల చేతిలో ఖ‌చ్చితంగా మ‌రోలా ఉండేది. సినిమాటోగ్ర‌ఫీ, నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ఎడిటింగ్‌లో ల‌వ్ సీన్ల‌కు చాలా వ‌ర‌కు క‌త్తెర వేస్తే బాగుండేది. న‌టీన‌టుల ప‌రంగా ర‌ణ‌బీర్‌, ఆలియా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ప్రేమ సీన్ల‌లో ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇంట‌ర్వెల్‌కు ముందు వ‌ర‌కు ప్రేమ సీన్ల‌తో న‌డిపించి అస‌లు క‌థ‌లోకి తీసుకు వెళ్ల‌లేదు.
సెకండాఫ్‌లో అయినా దైవ‌శ‌క్తి, దుష్ట‌శ‌క్తి మ‌ధ్య పోరుతో ఆస‌క్తిగా మ‌లుస్తార‌ని అనుకుంటే అప్పుడు కూడా ప్రేమ‌క‌థ‌పై న‌డిపిస్తూ ప్రేక్ష‌కుల‌ను డిజప్పాయింట్ చేశారు. ఇక అనీష్ శెట్టిగా నాగార్జున క‌నిపించింది కాసేపే అయినా ఆక‌ట్టుకున్నాడు.

బ్ర‌హ్మాస్త్రం మూడు ముక్క‌లు అన‌గానే అది మూడు వేర్వేరు వ్య‌క్తుల ద‌గ్గ‌ర ఉంటుంది. ఇక సినిమా కూడా మూడు ముక్క‌లు అయిన‌ట్టుగా ఉంది. అస‌లు హీరోతో హీరోయిన్ ఎందుకు ప్రేమలో పడింది ? అత‌డి కోసం ప్రాణాల‌కు ఎందుకు ? తెగించింది ? అన్న‌ది చూస్తే రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల రేంజ్‌లో ఉంటుంది. ఏదేమైనా ఆ విజువ‌ల్స్ ఎఫెక్ట్స్‌తో పాటు ఆ భారీ ఖ‌ర్చు కోసం ఓ సారి చూడాల‌నుకున్న వాళ్ల‌కు మాత్ర‌మే బ్ర‌హ్మాస్త్రం ఆప్ష‌న్‌. అంత‌కు మించి అంచ‌నాల‌తో వెళితే నిరాశ త‌ప్ప‌దు.

ఫైన‌ల్ పంచ్ :
బ్ర‌హ్మాస్త్రం అంత బ్ర‌హ్మాండంగా లేదు.

బ్ర‌హ్మాస్త్రం రేటింగ్ : 2.25 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news