విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అన్నగారు ఎన్టీఆర్ అనేక చిత్రాల్లో నటించారు. దీనికి గాను తొలి నాళ్లలో కొన్ని ఇబ్బందులు పడినా.. తర్వాతతర్వాత.. మాత్రం అన్నగారి ప్రయాణం.. నల్లేరుపై నడకే అయిపో యింది. ఆయన కోసం వేచి ఉన్న నిర్మాతలు.. దర్శకులు అనేక మంది ఉన్నారు. ఎన్టీఆర్ కాల్ షీట్ కోసం.. ఎన్నాళ్లని వేచి చూస్తాం.. అని విసుక్కున్న వారు కూడా ఉన్నారు. అంతేకాదు.. ఆయనతో బాగా దగ్గర చనువున్న వారు.. ఎన్టీఆర్ మారిపోయాడోయ్..! అని అనేవారు.
అంతగా బిజీ అయిపోయారు ఎన్టీఆర్. ఏ సినిమా కోసం.. ఆయన రిస్క్ చేసేవారు కాదు. కానీ, ఒకే ఒక్క సినిమా కోసం.. కొన్ని సినిమాలను వదులుకున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో ఆయన ఆహార నియమాలు కూడా పాటించారు.. అదే.. లవకుశ చిత్రం. ఈ సినిమా ఏమీ.. ఒక ఏడాదిలో పూర్తయి పోలేదు. దీని నిర్మాణమే చాలా చిత్రంగా సాగింది. తొలిదశలో ఈ సినిమాను కేవలం ఏడాదిలో పూర్తి చేయాలని అనుకున్నారు.
కానీ సినిమా దర్శకుడు మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో బ్రేక్ పడింది. ఇక, కొన్నాళ్లు సినిమా మళ్లీ పట్టాలెక్కుతుందని అనుకున్న సమయంలో నిర్మాణ సంస్థకు ఆర్థిక సమస్యలు వచ్చాయి. దీంతో అనేక బాలారిష్టాలను దాటుకుని.. ఈ సినిమా ఏకంగా మూడేళ్ల 120 రోజుల పాటు షూటింగు చేసుకుంది. ఈ క్రమంలో ఇంత సుదీర్ఘ సమయంలో అన్నగారు.. అనేక సినిమాలకు కాల్ షీట్లు ఇచ్చేశారు.
అయితే.. లవకుశ చారిత్రాత్మక చిత్రం కావడం.. రామాయణ ప్రాధాన్యం ఉండడంతో కొన్ని సినిమాలను రద్దు చేసుకుని.. మరీ ఈ సినిమాకు అన్నగారు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అయితే ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. తెలుగు సినిమా ఎప్పటకీ గర్వించదగ్గ క్లాసిక్ సినిమాలలో ఒకటిగా నిలుస్తూ అప్రతిహత విజయం సాధించింది.
ఆ రోజుల్లోనే లేట్ రిలీజ్‌లతో కలుపుకుని ఏకంగా 62 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ రోజుల్లోనే ఈ సినిమా టిక్కెట్ల కోసం పల్లెల నుంచి బళ్లు కట్టుకుని మరీ ఉదయం 6 గంటలకే థియేటర్ల దగ్గర కూర్చొనే వారు. ఉదయం నుంచే క్యూలో ఉండేవారు. ఆ సినిమా అప్పట్లో తెలుగు గడ్డను భక్తి పారవశ్యంతో ఊపేసింది.