టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు గత కొంత కాలంగా సరైన హిట్ లేదు. అప్పుడెప్పుడో ఐదేళ్ల క్రితం బాలయ్య, చిరు సినిమాలకు పోటీగా సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత శర్వానంద్ ఎన్ని సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా రావడం లేదు. ఎన్నో కాంబినేషన్లు మార్చాడు.. సమంత లాంటి స్టార్ హీరోయిన్‌తో నటించినా కూడా పనవ్వలేదు.
ఇక తాజాగా శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమా ఈ నెల 9న రిలీజ్ అవుతోంది. అదే రోజు దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో రణబీర్‌కపూర్, అలియాభట్ బ్రహ్మోస్త్ర కూడా రిలీజ్ అవుతోంది. మరీ అంత పెద్ద సినిమాకు పోటీగా వస్తున్నా కూడా ఈ సినిమాతో తాను ఖచ్చితంగా హిట్ కొడతానని శర్వా ధీమాతో ఉన్నాడు. అయితే ఓ సినిమాను తాను నమ్మి జీవితంలో ఏం కోల్పోయానో ? ఆర్తికంగా ఎంత నష్టపోయానో కూడా శర్వా ఈ సందర్భంగా తెలిపాడు.
పడిపడి లేచే మనసు ఖచ్చితంగా ఆడుతుందన్న ధీమాతో ఉన్నానని.. అయితే ఆ సినిమా ఆడకపోవడంతో తాను మూడు నెలల పాటు అసలు బయటకే రాలేదని చెప్పాడు. ఇక మా అమ్మ బంగారం అమ్మి మరీ కో అంటే కోటి సినిమా చేశామని… ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో చాలా దారుణమైన స్థితికి వెళ్లిపోయామని చెప్పాడు. ఆ సినిమా దెబ్బతో రిలేషన్లు పోయాయి.. అప్పులు ఎక్కువయ్యాయి.. చివరకు ఆ అప్పులు తీర్చేందుకు ఆరేళ్లు పట్టిందని శర్వా వాపోయాడు.
అన్నేళ్ల పాటు తాను ఒక్క షర్ట్ కూడా కొనుక్కోలేదని తీవ్ర ఆవేదనతో చెప్పాడు. ఇక రన్ రాజా రన్ సినిమా హిట్ అయినప్పుడు ప్రభాస్ అన్న ఇంటికి పిలిచి మరీ పార్టీ ఇచ్చాడని.. అయితే తాను నమ్మలేదని… సోమవారం వరకు ఆగితే కాని తాను సినిమా హిట్ అన్నది నమ్మనని చెప్పాడు. అలా తాను ఆ సమయంలో సక్సెస్‌లు కూడా ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉన్నానని ఆ బాధలు చెప్పుకు వచ్చాడు.