టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోలు నటించిన సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమా నుంచి ఇది బాగా ఎక్కువైంది. మహేష్ పోకిరి సినిమాకు ఏపీ, తెలంగాణతో పాటు అమెరికాలో కలుపుకుని ఏకంగా 400 షోలు వేశారు. ఈ షోలు చూసిన ఇండస్ట్రీ జనాలు షాక్ అయిపోయారు. ఈ సినిమా వసూళ్లు కూడా కోటిన్నర దాటడంతో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే మూడు వారాల్లోనే పోకిరి రికార్డులు బ్రేక్ అయిపోయాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా సినిమా వచ్చింది. జల్సా కోసం వేసిన షోలు, వచ్చిన వసూళ్ల దెబ్బతో పోకిరి రికార్డులు బ్రేక్ అయ్యాయి. పోకిరి రికార్డులు బ్రేక్ చేసే వరకు మెగా, పవన్ అభిమానులు అస్సలు నిద్రపోలేదు. ఇక ఇప్పుడు నందమూరి అభిమానుల వంతు వచ్చింది. బాలయ్య నటించిన హిట్ సినిమా చెన్నకేశవరెడ్డి వచ్చి 20 ఏళ్లు అవుతోంది.
ఈ క్రమంలోనే శని, ఆదివారాల్లో ఏపీ, తెలంగాణతో పాటు అమెరికాలో భారీ ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేయడంతో పాటు షోలు వేశారు. అయితే యూఎస్ లో చెన్నకేశవరెడ్డి సినిమాను ఏకంగా 32 లొకేషన్లలో 82 స్పెషల్ షోలు వేశారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు అయినా రీ రిలీజ్ పరంగా ఇదే రికార్డు. ఇక అమెరికాలో పాత రీ రిలీజ్ రికార్డులు కూడా బ్రేక్ అయిపోయాయి.
పోకిరికి యుఎస్ లో రూ.13 లక్షల గ్రాస్ వస్తే, జల్సాకు రు. 30 లక్షలు వచ్చింది. అయితే చెన్నకేశవరెడ్డికి ఏకంగా రు. 32 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇలా ఓవర్సీస్ వరకు చెన్నకేశవరెడ్డి దుమ్ము దులిపేసింది. జల్సా రీ రిలీజ్ రికార్డులను తక్కువ వ్యవధిలోనే చెరిపేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఏదేమైనా బాలయ్య ఫ్యాన్స్ రీ సౌండ్ అయితే మామూలుగా లేదు.