టాలీవుడ్ లో అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం హీరోల రెమ్యునరేషన్లతో పాటు ప్రతి ఒక్కరి రెమ్యూనరేషన్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే అగ్ర హీరోలతో సినిమాలు చేస్తే లాభాలు వస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే సినిమాల బడ్జెట్ పెరిగిపోవడంతో కొన్ని సినిమాలు భారీ అంచనాలతో వచ్చి భారీ డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. సినిమా బడ్జెట్ పెరిగిపోవడం.. ఎక్కువ రేట్లకు అమ్మడం.. ఆ రేంజ్ లో కలెక్షన్లు రాకపోవడంతో పెద్ద సినిమాలకు నష్టాలు తప్పడం లేదు. అయితే భారీ డిజాస్టర్ టాక్ తో కూడా రు. 90 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన ఘనత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే దక్కుతుంది.
`గోపాల గోపాల` సినిమా డైరెక్టర్ డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా `కాటమరాయుడు` భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రు. 89 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తమిళంలో హిట్ అయిన వీరమ్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. విచిత్రం ఏంటంటే అదే వీరమ్ సినిమా తెలుగులో `వీరుడొక్కడే` పేరుతో డబ్బ్ అయింది. అయినా అదే సినిమాను పవన్ తెలుగులో మార్పులు చేర్పులు చేసి `కాటమరాయుడు` పేరుతో రీమేక్ చేశారు. పవన్ కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. సినిమా ఏ మాత్రం ప్రేక్షకులకు ఎక్కలేదు. చాలామంది కాటమరాడ్ అని విమర్శలు కూడా చేశారు. అంత డిజాస్టర్ అయిన `కాటమరాయుడు` బాక్సాఫీస్ వద్ద రు. 90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు తొలిరోజే ఏకంగా రు. 50 కోట్లకు పైగా వసూళ్ల రావటం విశేషం.
ఇక పవన్ కెరీర్ ని సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా టర్న్ చేసిన సినిమా `గబ్బర్ సింగ్` బాలీవుడ్ లో హిట్ అయిన సల్మాన్ ఖాన్ `దబంగ్` సినిమాకు రీమేక్‌గా ఈ `గబ్బర్ సింగ్` తెరకెక్కింది. బండ్ల గణేష్ నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ యూత్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. పైగా 10 ఏళ్లుగా సరైన హిట్ కోసం ఆకలితో అలమటిస్తున్న పవన్ అభిమానులకు గబ్బర్ సింగ్ మంచి బిర్యానీ భోజనం ఇచ్చినట్టు అయింది. గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్ గా పవన్ స్వయంగా కథ రాసుకున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. కాజల్ హీరోయిన్‌గా నటించగా భారీ అంచనాలతో ప్రేక్షకులకు ముందు వచ్చి డిజాస్టర్ అయింది. అయినా కూడా `సర్దార్ గబ్బర్ సింగ్` బాక్సాఫీస్ దగ్గర రు. 92 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు కూడా తొలి రోజు ఏకంగా రు. 50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఎలాంటి క్రేజీ ఉంటుందో తెలుసు. వీరిద్దరి కాంబినేషన్లో `జల్సా`, `అత్తారింటికి దారేది`, `అజ్ఞాతవాసి` సినిమాలు వచ్చాయి. `అజ్ఞాతవాసి` సినిమాకు ముందు టాలీవుడ్ మొత్తం భారీ అంచనాలతో షేక్ అయిపోయింది. అప్పటికే జల్సా, అత్తారింటికి దారేది లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు వీరి కాంబినేషన్లో రావడంతో కచ్చితంగా `అజ్ఞాతవాసి` టాలీవుడ్ రికార్డులకు పోటీ ఇస్తుందని సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అందరూ ఆశించారు.
2018 సంక్రాంతి కానుకగా వచ్చిన `అజ్ఞాతవాసి` అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాకు ముందు నుంచే రాజకీయపరంగా నెగిటివ్ టాక్ బాగా వచ్చేసింది. ఫ్రెంచ్ సినిమా లార్గోవిచ్ కు అజ్ఞాతవాసి కాపీ అన్న విమర్శలు వచ్చాయి. చివరకు సినిమా రిలీజ్ అయ్యాక అదే నిజమని తేలింది. అంతా డిజాస్టర్ టాక్ తో కూడా `అజ్ఞాతవాసి` 95 కోట్ల గ్రాస్ రాబట్టింది. విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ డిజాస్టర్ సినిమాలకు దాదాపుగా రు. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి. అదే తెలుగులో చాలామంది స్టార్ హీరోల సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా ఈ స్థాయి వసూళ్లు రావటం లేదు. ఆ క్రేజ్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే సొంతం అని చెప్పాలి.