ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సందర్భం కలిసి వస్తుంది. ఒక్కొక్క సమయం కలిసివస్తుంది. అలానే.. అన్నగారు ఎన్టీఆర్ కు కూడా.. ఒక్కొక్క సమయం కలిసి రాలేదు.. మరికొన్ని సందర్భాలు కలిసి వచ్చాయి. అలనాటి దిగ్గజ దర్శకుడు యోగానంద్‌తో అన్నగారికి ఎనలేని మక్కువ ఉంది. ఆయన దర్శకత్వంలో అనేక సినిమాలు కూడా వచ్చాయి. అయితే.. ఒకటి రెండు కీలక సినిమాలు అనుకున్నవి విజయం దక్కించుకోలేక పోయాయి. దీంతో దర్శకుడు కమ్ నిర్మాత అయిన.. యోగానంద్ నష్టపోయి అప్పల్లో కూరుకుపోయారు.
ఈ పరిణామాల నేపథ్యంలో యోగానంద్‌తో ఉన్న సాన్నిహిత్యంతో అన్నగారు.. తన సోదరుడైన ఎన్. త్రివి క్రమ రావును నిర్మాతగా నిలబెట్టి.. యోగానంద్‌ను ఆర్థికంగా పుంజుకునేలా చేశారనేది.. అప్పటి సినీ రంగం టాక్. ఎలా అంటే.. తీవ్రంగా నష్టపోయిన.. యోగానంద్ ఏమీ తెలియక ఇబ్బంది పడేవారు. అయితే.. ఆయన రూపొందించిన సినిమాల్లోనే నటించిన ఎన్టీఆర్ కూడా తీవ్రంగా ఇబ్బంది పడేవారు. ఇలాంటి సమయంలో ఏదైనా చేసి మళ్లీ యోగానంద్‌ను గట్టెక్కించాలని తపన పడేవారు.
ఇలా చేసిందే.. `జయసింహ` సినిమా. 1955లో వచ్చిన ఈ సినిమాకు నిర్మాత త్రివిక్రమరావు కాగా , దర్శకు డు యోగానంద్. హీరో.. అన్నగారు.. హీరోయిన్ అంజలీదేవి. 1955. అక్టోబరు 21న విడుదలైన ఈ సినిమా.. పెద్ద మైలేజీ సాధించింది. భారీ విజయం నమోదు చేసింది. సీడెడ్, నైజాం.. సహా అన్ని ప్రాంతాల్లోనూ.. జయసింహ అదిరిపోయే విజయం దక్కించుకుంది. ఇది అటు నిర్మాత, ఇటు దర్శకులకు మంచి పేరు తీసుకు వచ్చింది.
అదే సమయంలో… అన్నగారి జీవితంలో అప్పటి వరకు ఎదురైన అనేక పరాజయాలను తుడిచిపెట్టింది.
ఎన్టీఆర్‌కు మాస్‌లోనూ తిరుగులేని స్టార్‌డమ్ వచ్చేలా చేసింది. ఇక, అప్పటి నుంచి అన్నగారు తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా.. ముందుకు సాగారని.. గుమ్మడి వెంకటేశ్వరరావు రాసిన.. తీపిగురుతులు-చేదు జ్ఞాపకాలు పుస్తకంలో వివరించారు. అంటే.. 1955 వరకు అన్నగారి జయాపజయాలు ఎలాఉన్నప్పటికీ.. జయసింహ తర్వాత.. మాత్రం వెనుదిరిగి చూసుకోలేదని అర్థమవుతుంది.