బాలయ్య సినిమా వస్తుందంటేనే చాలు ఆయన ఫ్యాన్స్‌ను అస్సలు ఆపలేం. అలాంటిది బాలయ్య కెరీర్ బ్లాక్‌బస్టర్ లాంటి సినిమా తర్వాత బాలయ్య సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల ఆనందానికి అస్సలు హద్దే ఉండదు. గతేడాది చివర్లో కరోనా తర్వాత వచ్చిన అఖండ సినిమాతో టోటల్ ఇండస్ట్రీకే కాదు… మూతపడ్డ థియేటర్లకు సైతం అదిరిపోయే ఊపు వచ్చింది. అఖండ థియేటర్లను ఊపేయడంతో పాటు బాలయ్య కెరీర్లోనే రు. 200 కోట్ల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది.
అఖండ తర్వాత బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు. శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటులు కూడా ఉన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ ఇస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముందుగా దసరాకే రిలీజ్ అనుకున్నా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే చాలాపేర్లు వినిపించాయి. జై బాలయ్య, అన్న గారు, మోనార్క్ లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరిగినా మేకర్స్ ఇప్పటి వరకు ఏదీ కన్ఫార్మ్ చేయలేదు.
ఇక దసరా కానుకగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఖచ్చితంగా దసరా రోజే టైటిల్ బయటకు వదులుతారా ? లేదా ఒక రోజు ముందుగానా ? అన్నది తెలియదు కాని… నందమూరి అభిమానులు దసరాను ఎంజాయ్ చేసేలా టైటిల్ ఉండబోతోందన్నది మాత్రం మేకర్స్ నుంచి లీకులు వస్తున్నాయి. టైటిల్ ఫ్యాన్స్‌కు ఎక్కాలే కాని.. సినిమా రిలీజ్ వరకు ఆగకుండానే నందమూరి అభిమానులకు పూనకాలు వచ్చేయడం ఖాయం. ఈ సినిమాలో బాలయ్య బాబు సరికొత్తగా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు.