నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. బాలయ్యకు పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రకం, సైన్స్ ఫిక్షన్ ఇలా ఏ కథలో అయినా నటించటం కొట్టినపిండి. బాలయ్య కెరీర్ లో వైవిధ్యమైన సినిమాలలో `ఆదిత్య 369` సినిమా ఒకటి సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథాంశం భూత , భవిష్యత్ , వర్తమాన కాలాల నేపథ్యంలో కొనసాగుతుంది.
సైన్స్ ఫిక్షన్ కథాంశం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో దేశవ్యాప్తంగానే ఓ ట్రెండ్ సెట్ చేసింది. అసలు ఎలాంటి స్టార్ హీరో అయినా.. ఇంత పెద్ద రిస్క్ చేసి ఇలాంటి సినిమాలో నటిస్తాడని ఊహించలేం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా ఎంతో అడ్వాన్స్ తో ఆలోచించి మరి `ఆదిత్య 369` సినిమాను తెరకెక్కించారు. సింగీతం – బాలయ్య కాంబినేషన్ లో ఆదిత్య 369, బైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు వేటికవే ఎంతో వైవిధ్యం కలిగిన సినిమాలు.
ఇక`ఆదిత్య 369` సినిమాను చూసిన నాసా శాస్త్రవేత్తలు సైతం సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారట. గుంటూరుకు చెందిన కొందరు ఆస్ట్రో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు నాసాలో పనిచేసేవారట. వారు ఇండియా వచ్చినప్పుడు ఈ సినిమా చూసి సింగీతం శ్రీనివాసరావు చాలా అద్భుతంగా ఆలోచించి ఈ టైం మిషన్ కాన్సెప్ట్‌ను డెవలప్ చేశారని మెచ్చుకున్నారట. ఈ విషయాన్ని సింగీతం తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో చెప్పారు.
అప్పట్లో `ఆదిత్య 369` ప్రేక్షకుల ప్రశంసలతో పాటు భారీ కలెక్షన్లు సైతం సాధించింది. అటు విమర్శకులు సైతం ఈ సినిమాను మెచ్చుకున్నారు. ఈ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి చూస్తుంటే కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక గత మూడేళ్లుగా కూడా ఈ సినిమాకు సీక్వెల్‌గా ఆదిత్య 999 సినిమా వస్తుందని.. దానిని కూడా సింగీతమే డైరెక్ట్ చేస్తారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.