ఇటీవల కాలంలో ఎవ్వరూ ఊహించని విధంగా… ఎప్పుడూ లేని విధంగా ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అయిన సీనియర్ నటులు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున సినిమాలు రెండు ఒకే రోజు లాక్ చేసుకున్నాయి. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ ల క్లాష్ కు సిద్ధపడటం అభిమానులకు సైతం టెన్షన్ గా మారింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. అలాంటిది ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి వస్తే ఎంత హిట్ టాక్ వచ్చినా వసూళ్లు కష్టమే.
ఈ క్రమంలోనే దసరా క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాతో వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పైగా ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత చిరు నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అదే రోజు మరో సీనియర్ నటుడు, కింగ్ నాగార్జున ది ఘోస్ట్ కూడా లాక్ అయ్యింది. ముందు చిరు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయినా కూడా నాగ్ పట్టుబట్టి అదే రోజు తన సినిమా రిలీజ్ డేట్ లాక్ చేయించారన్న టాక్ వచ్చింది.
అయితే ఇప్పుడు చిరు ఫోన్ కాల్‌తో నాగ్ త్యాగం చేసినట్టుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ది ఘోస్ట్ కొంత వెనుకడుగు తీసుకుని అక్టోబర్ 5కు బదులుగా 7న థియేటర్లలోకి వస్తోందట. నాగ్‌కు స్వయంగా చిరుయే ఫోన్ చేయడంతో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని.. ఘోస్ట్ దాదాపు వెనక్కు తగ్గినట్టే అంటున్నారు. రెండు సినిమాల మధ్యలో మూడు రోజులు గ్యాప్ ఉంటే ఓపెనింగ్స్‌పై పెద్ద ఇబ్బంది ఉండదు.
అదే రెండు సినిమాలు ఒకే రోజు వస్తే… రెండు సినిమాల మార్కెట్ ఎంత వేరు అయినా ఖచ్చితంగా నాగ్ సినిమాకు కూడా చాలా స్క్రీన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు చిరు సినిమా ఓపెనింగ్‌పై ప్రభావం ఉంటుంది. అసలు సోలోగా వస్తేనే ఆచార్యకు బజ్ లేదు. అలాంటిది మరో స్టార్ హీరో సినిమా పోటీ ఉందంటే ఎంతైనా ఇద్దరికి ఇబ్బంది తప్పదు. అందుకే చిరుయే ఈ పోటీ లేకుండా ఉండేందుకు నాగ్‌కు ఫోన్ చేశాడని అంటున్నారు.