దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ `బాహుబలి`. తెలుగు సినిమా ఖ్యాతిని దేశం ఎల్లలు దాటించేసి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప సినిమా బాహుబలి. 2015లో `బాహుబలి ది బిగినింగ్` సినిమా రాగా రెండేళ్ల తర్వాత 2017లో `బాహుబలి ది కంక్లూజన్` సినిమా వచ్చింది. బాహుబలి సినిమా భారీ అంచనాలతో వచ్చి దేశం మొత్తం ఒక ఊపు ఊపేసింది. అసలు రెండేళ్ల పాటు యావత్ భారత దేశంలో ఉన్న సినీ ప్రేమికులు అందరూ `బాహుబలి ది కంక్లూజన్` కోసం ఎదురు చూసేలా చేయటంలో ది బిగినింగ్ సినిమా సూపర్ సక్సెస్ అయింది.
బాహుబలి వన్ లో ప్రభాస్ – తమన్నా మధ్య పచ్చబొట్టేసిన సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ సూపర్ హిట్ అవడంతో పాటు సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. ఎంఎం. కీరవాణి సంగీతం అందించగా ఈ పాటను అనంత శ్రీరామ్ రచించారు. సహజంగా ఎంత గొప్ప పాట అయినా రాసేందుకు రచయితలకు ఐదారు రోజులకు మించి పట్టదు. అయితే అనంత శ్రీరామ్ కు ఈ పాట రాయటానికి ఏకంగా 73 రోజులు పట్టిందట.
ఈ పాట రాసేందుకు తాను అంత కష్టపడటానికి కారణాన్ని కూడా అనంత శ్రీరామ్ చెప్పాడు. సినిమాలో తమన్నాది ఒక నక్సలైట్ క్యారెక్టర్ ను పోలి ఉంటుందని.. అదే ప్రభాస్ శివుడు క్యారెక్టర్. ఒక గూడెంలో పెరిగిన క్యారెక్టర్ అని వీరిద్దరి నేపథ్యాలు వేరువేరుగా ఉండడంతో వారిని ఎలా ? కలపాలా అని ఆలోచించాల్సి వచ్చిందని శ్రీరామ్ తెలిపాడు. ఈ పాటలో గ్రామీణం, జానపదం తీసుకుని పాట రాస్తే అది తమన్నా నేపథ్యానికి విరుద్ధంగా ఉంటుందని… అదే పూర్తిగా గ్రాంధీకం తీసుకుని పాఠా రాస్తే అది ప్రభాస్ శివుడు పాత్రకు విరుద్ధంగా ఉంటుందన్నాడు.
అందుకే వీరిద్దరి పాత్రలను జత పోలుస్తూ పదాలు కూర్చుంటూ పాట రాయడానికి అన్ని రోజులు పట్టిందని శ్రీరామ్ చెప్పాడు. అలాగే ఆ పాట వచ్చే సిచ్యుయేషన్ కూడా తమన్నా యుద్ధానికి వెళ్లేముందు తాను ఎప్పుడూ చూడని ప్రేమను ప్రభాస్‌లో చూస్తుందని… ప్రభాస్ కూడా ఆమె ప్రేమ కోసం తహతహలాడుతూ ఉంటాడని అందుకే ఇన్ని కోణాలు బ్యాలెన్స్ చేయాల్సి వచ్చిందన్నాడు. ఈ పాట రాసేందుకు తాను అన్ని రోజులు తీసుకున్నా దర్శకుడు రాజమౌళి తనను ఏనాడు పాట ఆలస్యం అవుతుందని ఒత్తిడి చేయలేదని.. అయితే ఆ పాట సినిమాలో పెద్ద హిట్ అయిందని శ్రీరామ్ చెప్పాడు.