Moviesఆ రోజుల్లో సీనియ‌ర్ ఎన్టీఆర్ రూం రెంట్‌, భోజ‌నం ఖ‌ర్చు, ఆదాయం...

ఆ రోజుల్లో సీనియ‌ర్ ఎన్టీఆర్ రూం రెంట్‌, భోజ‌నం ఖ‌ర్చు, ఆదాయం గుట్టు విప్పిన సీనియ‌ర్ న‌టుడు..!

విశ్వవిఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావు.. త‌న సినీ జీవితంలోనే కాకుండా.. రాజ‌కీయ జీవితంలోనూ.. చాలా క్ర‌మ‌శిక్ష‌ణ ను పాటించారు. ముఖ్యంగా ఆర్థిక ప‌ర‌మైన క్ర‌మ‌శిక్ష‌ణ మ‌నిషిని ఉన్న‌త స్థానానికి చేరుస్తుంద‌ని ఆయ‌న న‌మ్మేవారు. ఆ న‌మ్మ‌కాన్ని ఆయ‌న నిల‌బెట్టుకున్నారు.. త‌న తోటి వారికి కూడా.. అర్ధ‌మ‌య్యేలా చెప్పి.. వారిని కూడా ఆర్థికంగా నిల‌దొక్కుకునేలా చేశారు.

ఎన్టీఆర్ సినీ రంగంలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో..విజ‌యా సంస్థ‌లో ప‌ర్మినెంట్ హీరోగా ప‌నిచేశారు. దీంతో ఆయ‌న‌కు నెల‌కు వారు.. రూ.500 శాల‌రీ ఇచ్చేవారు. ఇది కాకుండా.. ప్ర‌తిసినిమాకు హిట్‌ను బ‌ట్టి రూ.5000 దాకా వ‌చ్చేది. ఇక‌, అదే స‌మ‌యంలో మిగిలిన వారిని చూస్తే..నెల‌కు కేవ‌లం 200 నుంచి 300 మాత్ర‌మే సంపాయించుకునేవారు. అంటే ఒక‌ర‌కంగా.. మిగిలిన వారితో ఆయ‌న ముందున్నార‌నే చెప్పాలి. అయినా.. కూడా ఖ‌ర్చు విష‌యంలో అన్న‌గారి జాగ్ర‌త్తే జాగ్ర‌త్త అంటారు గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర‌రావు.

గుమ్మ‌డి స్వ‌యంగా రాసుకున్న తీపి గురుతులు.. చేదు జ్ఞాప‌కాలు.. పుస్త‌కంలో అన్న‌గారి ఖ‌ర్చుల‌ను ఏక రువు పెట్టారు. తాను నెల‌కు రూ.200 సంపాయించి. రూ.400 ఖ‌ర్చు చేయ‌డాన్ని అన్న‌గారు త‌ప్పుబ‌ట్టే వార‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వ‌చ్చిన ఆదాయంలోనే ఖ‌ర్చులు ఉండాలి త‌ప్ప‌.. అప్పులు చేసి ప‌ప్పు కూడు తిన‌డాన్ని అన్న‌గారు స‌హించేవారు కాద‌ని.. గుమ్మ‌డి రాసుకొచ్చారు. ఓ సంద‌ర్భంలో వీరిమ‌ధ్య జ‌రిగిన ఖ‌ర్చుల చ‌ర్చ‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

తాను 200 సంపాయించి రూ.400 ఖ‌ర్చు చేస్తే.. అన్న‌గారు రూ.500 సంపాయించి కూడా నెల‌కు రూ.100 రూపాయ‌లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలిపారు. దీనిలో రూం రెంట్‌కు రూ.50, నెల‌కు అయ్యే క్యారేజీ భోజ‌నం ఖ‌ర్చురూ.25, ఇత‌ర టీ, కాఫీ.. ఇత్యాది ఖ‌ర్చుల‌కు రూ.25 మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టార‌ని చెప్పారు. మిగిలిన సొమ్మును ఇంటికి పంపించేవార‌ని.. క‌ష్ట‌ప‌డ‌డమే కాదు.. త‌ద్వారా వ‌చ్చిన సొమ్మును సైతం.. జాగ్ర‌త్త చేసుకోవ‌డం.. భ‌విష్య‌త్తుకు వినియోగించుకోవ‌డం అత్యంత ముఖ్య‌మ‌ని అన్న‌గారు చెప్పిన‌ట్టు.. గుమ్మ‌డి వివ‌రించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news