విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ అనేక సినిమాల్లో నటించారు. అనేక పాత్రలు కూడా ధరించారు. అయితే.. ఆయన సినిమాలు తెలుగులోనే కాదు.. బాలీవుడ్‌లోనూ అనేక విజయాలు నమోదు చేశాయి. మరీ ముఖ్యంగా సాంఘిక పాత్రలో నటించిన చిత్రాలు చాలా రోజులు డబ్ చేసుకుని మరీ హిందీలో ఆడించారు. అయితే.. అవి అంతగా రికార్డులు సృష్టించలేదు. కానీ, ఒక సినిమా మాత్రం రికార్డులు బద్దలు కొట్టింది. అన్నగారికి బాలీవుడ్‌లో అవకాశాలు తీసుకువచ్చింది.
అదే.. గజదొంగ సినిమా. ఈ సినిమాలో అన్నగారు దొంగగానే నటించినా.. దీనివెనుక ఉన్న బలమైన కథ, కథనం.. మక్కీకిమక్కీ హిందీలో రచయిత చేసిన ప్రయోగాలు.. వంటివి తెలుగులోనే కాకుండా.. హిందీలో నూ సినిమాను అద్వితీయంగా తీర్చిదిద్దాయి. దీంతో తెలుగులో ఎంత ఆదరణ లభించిందో గజదొంగ సినిమా అంతే విజయం హిందీలోనూ అందుకుంది. మహారాష్ట్రలో అయితే.. ఏకంగా నాలుగు సినిమా హాళ్లలో శత దినోత్సవం పూర్తి చేసుకుంది.
నిజానికి సినిమాలను పెద్దగా ఇష్టపడని వారు కూడా.. ఈ సినిమాను మెచ్చుకున్నారు. శివసేన అధినేత బాల ఠాక్రే అప్పట్లో ఎన్టీఆర్‌ను అభినందించారు. స్వయంగా తన నివాసానికి పిలిచి.. ప్రత్యేకంగా సత్కరించారు. వాస్తవానికి ఈ సినిమా గతంలో వచ్చిన హిందీ సినిమా కథతోనే నిర్మించారు. కానీ, తెలుగులో కొన్ని.. ప్రత్యేకతలను జోడించడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఈ సినిమా విజయం తర్వాత.. అన్నగారికి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆయన తెలుగుభాషపై ప్రేమతో తెలుగు చిత్రసీమకే పరిమితమైపోయారు. విచిత్రం ఏంటంటే సౌత్‌లో ఎన్టీఆర్ తెలుగులో నటించిన చాలా సినిమాలు అప్పట్లో చెన్నై, బెంగళూరులో 100, 200 రోజులు ఆడేవి. అది ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్.