టాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రిందట వచ్చిన `నువ్వే కావాలి` సినిమా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో యువత `నువ్వే కావాలి` సినిమా అంటే పిచ్చెక్కిపోయారు. యువతను అంతలా మత్తులోకి దింపేసింది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాలో తరుణ్, సాయికిరణ్ హీరోలుగా నటించగా.. రీచా హీరోయిన్ గా నటించింది. కే విజయ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఆ రోజుల్లోనే ఈ సినిమా చాలా ధియేటర్లలో ఏడాదికి పైగా ఆడిందంటే.. నువ్వే కావాలి మానియా నాటి తెలుగు గెడ్డను ఎంతలా ఊపేసిందో అర్థం చేసుకోవచ్చు. నువ్వేకావాలి సినిమాలో పాటలు అన్నీ సూపర్ హిట్. ఈ సినిమాలో తరుణ్ తో పాటు అలనాటి మేటి గాయకుడు రామకృష్ణ తనయుడు సాయికిరణ్ కూడా మరో హీరోగా నటించాడు. ఈ సినిమా తర్వాత సాయికిరణ్ కు టాలీవుడ్ బడా నిర్మాత డాక్టర్ డి రామానాయుడు తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించిన `ప్రేమించు` సినిమాలో హీరోగా నటించే అవకాశం ఇచ్చారు.
ఈ సినిమాలో సాయికిరణ్ కు జోడీగా లయ నటించింది. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. పాటలు కూడా సినిమా విజయంలో కీలకంగా నిలిచాయి. ఆ తర్వాత కుర్ర హీరోల పోటీ తట్టుకోలేక సాయికిరణ్ బుల్లితెర హీరోగా మారిపోయి సీరియల్స్ తో అలరించడం మొదలుపెట్టాడు. ఇక ప్రేమించు సినిమాలో జంటగా నటించిన సాయికిరణ్, లయ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. ఇది నిజమే అని సాయికిరణ్ కూడా క్లారిటీ ఇచ్చాడు. అటు సాయికిరణ్ తల్లిదండ్రులు, ఇటు లయ తల్లిదండ్రులు కూడా ఇద్దరు భార్యాభర్తలు అయితే బాగుంటుందని అనుకున్నారట.
అయితే జాతకాలు కుదరక పోవడంతో ఈ పెళ్లి జరగలేదని.. అంతకుమించి మరో కారణం లేదని సాయికిరణ్ చెప్పాడు. అయితే ఆ తర్వాత కూడా మేమిద్దరం కలిసి ఒక సినిమాలో నటించామని తెలిపాడు. ఇక ఇప్పటికీ మా మధ్య మంచి స్నేహం ఉందని సాయికిరణ్ చెప్పాడు. తమ కుటుంబంలో జాతకాలను ఎక్కువగా నమ్ముతారని, అలాగే తాను కూడా జాతకాలను బాగా నమ్ముతానని సాయికిరణ్ చెప్పాడు.
ముందు జాతకాలు ట్రాష్ అనుకునేవాడిని అని.. ఆ తర్వాత ఒక్కో గ్రహం మన జీవితాన్ని ఎలా ?ప్రభావితం చేస్తుందో తెలిశాక తాను కూడా జాతకాలను నమ్ముతున్నానని సాయికిరణ్ తెలిపాడు. ఇక సాయికిరణ్ గొప్ప శివ భక్తుడు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత లయ అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ ను పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయింది.