నిన్న ఆదివారం టాలీవుడ్‌కు సంబంధించి రెండు ఇంట్రెస్టింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా భారీగా ట్రెండ్ అయింది. సోమవారం చిరంజీవి పుట్టినరోజు జరుపుకుంటున్నా ఆదివారం ఉదయం నుంచే సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు.. ఆయన అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను హోరెత్తించారు. మెగా అభిమానుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ ఆయన నటిస్తున్న తాజా సినిమాలకు సంబంధించిన అప్డేట్లు కూడా బయటికి వచ్చాయి.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న భోలాశంకర్ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడంతో పాటు ఆ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 15 రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించేశారు. ఇక చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా టీజర్ కూడా సాయంత్రం బయటికి వదిలారు. ఇలా నిన్నంతా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చిరంజీవి హంగామానే నడిచింది. అయితే ఆదివారం మధ్యాహ్నంకు పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావాలని అనుకున్నారు.
అప్పటికప్పుడు సడెన్‌గా అమిత్ షా ఎన్టీఆర్‌ను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు అయితే ఈ ప్రకటన బయటకు వచ్చిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ మారిపోయింది. ఎన్టీఆర్ – అమిత్ షా భేటీ గురించి ఎక్కడ చూసినా చర్చ జరిగింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రెండో ప్లేసులోకి వెళ్లిపోగా… అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. ఇక ఉక్రెయిన్ యుద్ధం మూడో ప్లేసులో ఉంది. ఆదివారం రాత్రి… సోమవారం ఉదయం కూడా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ భేటీ గురించి జోరుగా చర్చ జరిగింది.
గత రాత్రి అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్‌కు రాత్రి 10:30 సమయంలో చేరుకున్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్టీఆర్‌ను అమిత్ షా దగ్గరకు తీసుకువెళ్లారు. ఎన్టీఆర్‌ను అమిత్ షా పుష్పగుచ్చంతో ఆహ్వానించగా ఆ తర్వాత అమిత్ షాకు ఎన్టీఆర్ శాలువా కప్పి సత్కరించారు. వీరిద్దరి మధ్య మొత్తం 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది.
ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తాను చూశానని.. ఎన్టీఆర్ అత్యంత ప్రతిభావంతుడైన నటుడు… తెలుగు సినిమా తారకరత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌ను ఈరోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించిందని అమిత్ షా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏదేమైనా ఆదివారం ఉదయం నుంచి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు హంగామా నడిచినా.. సాయంత్రం నుంచి దానిని బీట్ చేసి ఎన్టీఆర్ – అమిత్ షా భేటీ ట్రెండింగ్ లో నిలిచింది. ఏదేమైనా ఎన్టీఆర్ పొలిటికల్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఇంతకన్నా సాక్ష్యాలు అక్కర్లేదు.