టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే ఎప్పుడు లేనట్టుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ తన కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్‌కు హిట్లు వచ్చాయి. చాలా తక్కువ టైంలోనే మంచి స్టార్ డం వచ్చింది. అయితే ఎన్టీఆర్‌ను నందమూరి ఫ్యామిలీ గుర్తించే విషయంలో చాలా ఆలస్యం జరిగింది.
స్టూడెంట్ నెంబర్ 1 – ఆది – సింహాద్రి లాంటి సూపర్ డూపర్ హిట్లు రావడంతో పాటు… ఎన్టీఆర్ అచ్చుగుద్దినట్టు తన తాత దివంగత నటరత్న నందమూరి తారక రామారావును పోలీ ఉన్నారన్న టాక్ నాడు ఆంధ్ర జనాల్లో విపరీతంగా వినిపించింది. దీంతో ఎన్టీఆర్‌కు పోటీగా కావాలనే తారకరత్నను తెరమీదకు తీసుకువచ్చారు. అందుకే ఒకే రోజు ఏకంగా తారకరత్న హీరోగా పరిచయం చేస్తూ తొమ్మిది సినిమాలకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాప్ కొట్టారు.
ఆ తర్వాత ఇదే నందమూరి ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ రామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కు 11 సంవత్సరాలు వచ్చే వరకు అసలు తన తాతతో అనుబంధమే లేదట. అప్పటివరకు తన తాతను ఒక్కసారి కూడా చూడలేదు అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు. ఎన్టీఆర్ ఒకసారి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతుండగా ఆయన పర్సనల్ సెక్రెటరీని పంపించి మనవడిని చూడాలి.. తీసుకురమ్మని కబురు పంపారట. ఎన్టీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతూనే అబిడ్స్ లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లారట.
ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన వెంటనే… తనకు అక్కడ దైవత్వంలోకి వెళ్లినట్టుగా అనిపించిందని… లోపల నుంచి ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించి వచ్చారని ఎన్టీఆర్ తెలిపారు. అప్పుడు తాత తనను దగ్గరికి తీసుకుని నీ పేరేమిటి అని ప్రశ్నించారని… అలా చాలాసేపు కుశల ప్రశ్నలు వేసి తనను ఆయన ఒడిలోనే కూర్చోపెట్టుకున్నట్టు గుర్తు ఉందని తెలిపాడు. ఆ తర్వాత ఏడాది పాటు తాను తాతతో ట్రావెల్ అయ్యానని… ప్రతిరోజు ఆయన ఇంటికి వెళ్లి సాయంత్రం వచ్చేవాడిని అని తన తాతతో సుమధుర స్మృతులను ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నాడు.