దివంగత నటరత్న ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా… ఆ పాత్రకి వన్నెతెచ్చిన నటుడు. ఎన్టీఆర్ కృష్ణుడు – దుర్యోధనుడు – రాముడు – విశ్వామిత్రుడు ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో అచ్చుగుద్దినట్టు ఒదిగిపోయారు. అందుకే ఎన్టీఆర్ చనిపోయి మూడు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ తెలుగు ప్రజలు ఆయనను ఒక రాముడుగా… ఒక కృష్ణుడిగా కొలుస్తూనే వస్తున్నారు. ఎన్టీఆర్ అభినయం, ఆహారం, డైలాగ్ డెలివరీ ఇలా ఏ విషయంలో చూసినా ఆయనకు ఆయనే సాటి.. ఆయనకు మరెవ్వరూ లేరు పోటీ అన్నట్టుగా ఆయన జీవించేవారు. అసలు ఇప్పటి తరంలో శ్రీరాముడు అంటేనే చాలామందికి తెలియదు.
ఎన్టీఆర్ శ్రీరాముడు రూపాన్ని చూస్తే రాముడంటే నిజంగా ఇలాగే ఉంటాడేమో అని మనసులో ప్రతి ఒక్కరు ఆయన రూపాన్ని నింపేసుకునేంత గొప్పగా ఆ పాత్రలో జీవించేశారు. పౌరాణికం – సాంఘికం – చారిత్రకం – జానపదం ఇలా ఏ కథలో అయినా ఎన్టీఆర్ ఇట్టే ఒదిగిపోయేవారు. ఇక ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన ముందుగా తన మేనమామ కుమార్తె అయిన బసవతారకంను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 12 మంది సంతానం. వీరిలో 8 మంది కుమారులు… కాగా నలుగురు కుమార్తెలు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయంలో బసవతారకం గర్భాశయ క్యాన్సర్ సోకి మృతి చెందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ 1994 ఎన్నికలకు ముందు లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ ఇద్దరి మధ్యలోనే మరో హీరోయిన్‌ను ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారని అంటారు. అది పెళ్లికి కూడా దారి తీసిందని ఆ హీరోయిన్ అక్కే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఇది పుకారేనా ? అన్న అనుమానాలు పటాపంచలు అయిపోయాయి.
నటి కృష్ణకుమారి, ఎన్టీఆర్‌ది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయి. ఎన్టీఆర్ – కృష్ణకుమారి ప్రేమించుకున్నారని.. అయితే వారికి పెళ్లి జరిగి ఉంటే అది నిజంగానే అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో అని కృష్ణకుమారి అక్క షావుకారు జానకీ తాజాగా చెప్పారు. తన చెల్లి కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్‌తో ఆమె ఏకంగా 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకుందని కూడా జానకీ చెప్పారు. ఆ తర్వాత ఆమె సీనియర్ జర్నలిస్ట్ అజయ్ మోహన్ కైఠాన్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఓ పెద్ద నిర్మాత తనకు ఫోన్ చేసి మీ చెల్లి ఆపమని చెప్పినా తాను నో చెప్పానని ఆమె నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
అయితే ఎన్టీఆర్.. కృష్ణకుమారిని పెళ్లాడేందుకు సిద్ధమైనప్పుడు ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు అన్నకు అడ్డు చెప్పారని అంటారు. అప్పటికే ఎన్టీఆర్‌కు తెలుగు నాట విపరీతమైన క్రేజ్ ఉంది. అన్న భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుంటే ఆయన క్రేజ్ తగ్గుతుందని భావించిన త్రివిక్రమరావు కృష్ణకుమారికి వార్నింగ్ ఇచ్చి మరీ ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించారని కూడా అంటారు.