టైటిల్: బింబిసార
బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్
నటీనటులు: నందమూరి కళ్యాణ్‌రామ్ – కేథరిన్ – సంయుక్త మీనన్ – వరీనా హుస్సేన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు
ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నే
వీఎఫ్ఎక్స్ : అనిల్ పాదూరి
ఎడిటింగ్: తమ్మిరాజు
మ్యూజిక్: ఎంఎం. కీరవాణి
సినిమాటోగ్రఫీ: ఛోటాకె. నాయుడు
నిర్మాత: హరికృష్ణ .కె
రచన – దర్శకత్వం: వశిష్ట్ మల్లిడి
సెన్సార్ రిపోర్ట్ : యూ / ఏ
రన్ టైం : 146 నిమిషాలు
రిలీజ్ డేట్: 5 ఆగస్టు, 2022
నందమూరి కళ్యాణ్‌రామ్‌కు పటాస్, 118 లాంటి హిట్ సినిమాల తర్వాత అదే రేంజ్‌లో హైప్ వచ్చిన సినిమా బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో రు. 37 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన బింబిసార సినిమాకు కళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఎన్టీఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రావడంతో పాటు కేథరిన్, సంయుక్త మీనన్ లాంటి హీరోయిన్లు ఉండడం, చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లో క్రీస్తూ పూర్వం కథకు, టైం ట్రావెల్‌కు లింక్ పెడుతూ వస్తోన్న సినిమా కావడంతో పాటు టీజర్, ట్రైలర్లు అయితే కుమ్మిపడేశాయి. మరి సీతా రామం లాంటి క్లాస్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ వస్తోన్న ఈ సినిమాతో కళ్యాణ్ హిట్ కొట్టాడో లేదో TL సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
క్రీస్తు పూర్వం 500 ఏళ్ల టైంలో త్రిగర్తల సామ్రాజ్యాన్ని బింబిసారుడు ( కళ్యాణ్‌రామ్) అనే రాజు పాలిస్తూ ఉంటాడు. అతడు అత్యంత క్రూరుడు.. చివరకు తనకు ఎదురు చెప్పారని చిన్న పిల్ల, వృద్ధులు అన్న తేడా లేకుండా చంపేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో అనుకోని శాపానికి గురైన బింబిసారుడు ప్రస్తుత కాలానికి వస్తాడు. ఆ ఆధునిక యుగంలోకి వచ్చిన బింబిసారుడికి ఎదురైన సవాళ్లు ఏంటి ? బింబిసారుడు దాచిన నిధి కోసం ప్రస్తుత యుగంలో వెంటాడే విలన్లు చివరకు ఏమయ్యారు ? బింబిసారుడికి అతడి సోదరుడు దేవదత్తుడు ( కళ్యాణ్‌రామ్)కు ఉన్న కనెక్షన్ ఏంటి ? చివరకు బింబిసారుడు ఈ యుగంలో ఉండిపోయాడా ? తిరిగి తన కాలానికి వెళ్లిపోయాడా ? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
TL విశ్లేషణ :
ఈ సినిమాకు ముందు సూపర్ హీరో దర్శకుడు వశిష్ట్. ఈ యువ దర్శకుడు తన మొదటి సినిమాకే క్రీస్తు పూర్వం రాజులు, టైం ట్రావెల్ కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. అందులోనూ ఆ కథను ఆ కాలానికి.. ఈ కాలానికి బ్యాలెన్స్ చేస్తూ.. ప్రేక్షకుడికి కనెక్ట్ చేస్తూ తెరకెక్కించడం గొప్ప విషయం. ఇండియన్ సినిమా రంగంలో అతి తక్కువ మంది టచ్ చేసే రిస్కీ జానర్ అయిన టైం ట్రావెల్ కాన్సెఫ్ట్, హిస్టారికల్, ప్రస్తుత కాలం వీటికి లింక్ పెట్టిన తీరుకు దర్శకుడి ప్రతిభకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.
ఇక హీరో కళ్యాణ్‌రామ్ సినిమాకు మెయిన్ పిల్లర్. బింబిసారుడిగా.. క్రూరవంతమైన రాజు పాత్రలో తన నట విశ్వరూపం చూపించేశాడు. అసలు కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఇదే బెస్ట్ పాత్ర. మళ్లీ అతడికి ఈ తరహా పాత్ర వస్తుందా ? అన్న సందేహం వచ్చేంత గొప్పగా ఈ పాత్రలో జీవించాడు. క్రూరుడిగా, ఎమోషనల్‌గా, డాషింగ్ డేర్‌గా తన డైలాగ్ డెలివరీ, యాక్షన్‌తో గూస్‌బంప్స్ తెప్పించేశాడు. ఇక హీరోయిన్లు క్యాథరిన్, సంయుక్త మీనన్‌కు పెద్ద స్కోప్ లేదు. వారు ఉన్నారంతే ఉన్నారు.
నిజం చెప్పాలంటే కాగితం మీద చూస్తే ఈ కాన్సెఫ్ట్ చాలా సింపుల్‌గా ఉంటుంది. దానిని తెరమీద రెండున్నర గంటల సినిమాగా చెప్పాలంటే మామూలు విషయం కాదు. మామూలుగా ఇలాంటి కథలను వర్తమానంలో మొదలు పెట్టి తర్వాత పురాతన యుగంలోకి తీసుకువెళ్లి.. తిరిగి వర్తమానంలోకి తీసుకువస్తారు. కానీ దర్శకుడు వశిష్ట్ ముందు స్టార్టింగే పూర్వపు కథతో ప్రారంభించి తర్వాత వర్తమానంలోకి తీసుకువచ్చాడు. ముందు వర్తమానంలో కథ ప్రారంభించడం సేఫ్‌గేమ్.. కాని దర్శకుడు పెద్ద రిస్క్ చేసి మరీ మెప్పించాడు.
కథలో మలుపు వచ్చిన దగ్గర సాగదీయకుండా కరెక్టుగా వర్తమాన కాలంలోకి తీసుకువచ్చి.. ప్రస్తుత నేపథ్యాన్ని చూపించడం… ఎప్పటికప్పుడు రాజుల కథకు, ప్రస్తుత కాలపు కథకు కన్‌ఫ్యూజ్ లేకుండా లింక్ చేయడం అభినందనీయం. అయితే కొన్ని చోట్ల ఎలివేషన్లకు మరింత స్కోప్ ఉన్నా దర్శకుడు వాడుకోలేదు. అయితే ఉన్నంతలో మాత్రం బింబిసార మెప్పించింది. సెకండాఫ్‌లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బింబిసార రేంజ్ గొప్ప సినిమాల జాబితాలో ఉండేది.
ఇక నటీనటుల్లో విలన్‌గా కనిపించిన వరిన హుస్సేన్ ఓకే అనిపించాడు. ఆ స్థానంలో కాస్త పేరున్న నటుడిని పెడితే విలన్ పాత్ర ఎలివేట్ అయ్యేది. ఇక అయ్యప్ప పి.శర్మ తనకు అలవాటైన మాంత్రికుడి పాత్ర చేయగా… ప్రకాష్‌రాజ్ పాత్ర మామూలుగానే ఉంది. అయితే కీలకమైన జుబేదా క్యారెక్టర్‌లో శ్రీనివాస్ రెడ్డి పాత్రకు మంచి స్కోప్ ఇచ్చాడు. బ్రహ్మాజీ.. వైవా హర్ష.. చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్ పాత్రలు ఓకే.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్ :
టెక్నికల్‌గా చూస్తే కీరవాణి నేపథ్య సంగీతం సినిమాను సగం హిట్ చేసేసింది. అసలు ఇలాంటి కథలకు కీరవాణి తప్ప మరో మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే ఆ సినిమా ఎలివేట్ కానేకాదు. నేపథ్య సంగీతంతో థియేటర్లలో ప్రేక్షకుడు ఊగిపోతాడు. చిరంతన్ భట్, కీరవాణి పాటలు వినడం కన్నా తెరమీద కథలో కలిసిపోయి చూస్తున్నప్పుడు బాగున్నాయి. ఇక ఛోటా కే నాయుడు చాలా రోజుల తర్వాత తన కెమేరా పనితనం చూపించాడు. విజువల్స్ అదిరిపోయాయి. వీఎఫ్ఎక్స్ టీం కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుట్ ఫుట్ ఇచ్చింది. వాసుదేవ్ మునెప్పగారి సంభాషణలు బాగున్నాయి. ఇక కళ్యాణ్‌రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాణ విలువలకు వంక పెట్టలేం. ఓ కొత్త దర్శకుడు, కొత్త కథను నమ్మి ఇంత పెట్టుబడి పెట్టి బ్యానర్ విలువ పెంచాడు కళ్యాణ్‌రామ్.
వశిష్ట్ డైరెక్షన్ కట్స్ :
ఇక దర్శకుడు, కథా రచయిత అయిన వశిష్ట్ తన తొలి సినిమాతోనే తనలో అద్భుతమైన టాలెంట్ ఉందని ఫ్రూవ్ చేసుకున్నాడు. వశిష్ట్ బలం అంతా అతడి రచనలోనే కనిపించింది. అసలు టైం ట్రావెల్‌కు, రాజుల కాలానికి, ప్రస్తుత కాలానికి లింక్ పెడుతూ.. సామాన్య ప్రేక్షకుడు కూడా కన్‌ఫ్యూజ్ కాకుండా కథ రాసుకుని.. తెరకెక్కించిన తీరు అద్భుతం. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంటుంది. సెకండాఫ్ మీద కాస్త దృష్టి పెట్టి ఉంటే బింబిసార మగధీర రేంజ్‌కు ఏ మాత్రం తీసిపోయి ఉండేదే కాదు. వశిష్ట్ ఈ తరహా కథలపై దృష్టి పెడితే టాలీవుడ్ గర్వించే గొప్ప దర్శకుడు అవుతాడు.
ఫైనల్‌గా…
ఓవరాల్‌గా చూస్తే బింబిసార సినిమాతో కేవలం మేకర్స్ కోరకున్న విజయం మాత్రమే కాదు.. టాలీవుడ్ ఎప్పటి నుంచో ఆసక్తితో ఎదురు చూస్తోన్న అద్భుత విజయం ఇండస్ట్రీకి దక్కింది. కళ్యాణ్‌రామ్ నట విశ్వరూపం, విజువల్స్, మ్యూజిక్, డైరెక్షన్ అదిరిపోయి సినిమాను హిట్ చేశాయి. మనం మరో ప్రపంచంలోకి వెల్లి మరీ సినిమాను ఎంజాయ్ చేస్తాం.
ఫైనల్ పంచ్ :
బింబిసార కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం
బింబిసార TL రేటింగ్ : 3.5 / 5