ఒక రంగాన్ని ఎంచుకున్న వ్యక్తి.. కేవలం ఆ రంగంలోనే ఉండి పోవడం సహజం. అయితే.. చాలా చాలా తక్కువ మంది మాత్రమే ఎంచుకున్న రంగంతోపాటు అనుబంధ రంగాల్లోనూ తమ దూకుడు ప్రదర్శిస్తా రు. ఆయా రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటారు. ఇలాంటి వారిలో విశ్వవిఖ్యాత నటసార్వభౌము డు ముందుంటారు. చలన చిత్ర రంగంలో ఆయన చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. దర్శకుడిగా.. నటుడిగా.. నిర్మాతగా ఆయన అనేక సినిమాలు చేశారు.
సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి చిత్రాలు సైతం నిర్మించారు. ఇక, మరికొన్ని సినిమాలకు ఆయన సహ నిర్మాతలుగా ఉన్నారు. అయితే.. అన్నగారిలో కనిపించని మరో కోణం కూడా ఉంది. అది.. ఆయన కు ఎనలేని కీర్తిని తీసుకువచ్చింది. అంతేకాదు.. ఏకంగా..నంది అవార్డును కూడా సొంత చేసింది. విషయం లోకి వెళ్తే.. 1970లలో వచ్చిన `తల్లా-పెళ్లామా` సినిమాలో అన్నగారు విశ్వరూపం చూపించారు. కుటుంబ కథారంగంలో ఇదొక అసమానమైన సినిమాగా నిలిచింది.
ఎన్టీఆర్ ఇందులో భిన్నమైన పాత్రలు పోషించారు. ఒకవైపు తల్లికి కుమారుడుగా.. మరోవైపు.. భార్యకు భర్తగా ఆయన నటన అసామాన్యం. తల్లిపై గౌరవం ప్రదర్శిస్తూ.. అత్తా కోడళ్ల మధ్య ఎదురయ్యే సమస్యల ను చాలా తెలివిగా పరిష్కరించాల్సిన పాత్ర. సాంఘిక చిత్రాల్లో కలికితురాయి అనదగ్గ మూవీగా తల్లా-పెళ్లామా ? మూవీ నిలిచిపోయింది. అయితే.. ఈ సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది. అదేంటంటే..ఎన్టీఆర్ నటనతోనే కాకుండా.. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు.. తల్లా-పెళ్లామా సినిమా కథ కూడా ఆయనదే కావడం గమనార్హం.
కేవలం కుటుంబ సంగతులే కాకుండా.. ఈ కథలో అన్నగారు.. వైవిధ్యం ప్రదర్శించారు. జాతీయ సమైక్యతను ప్రబోధించారు. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం అప్పట్లో అందించిన నంది అవార్డుల జాబితాలో ఈ సినిమా ఎంపికైంది. అయితే.. అది ఉత్తమ కథా రంగంలో కావడం గమనార్హం. ఉత్తమ కథకు ఇచ్చే నంది అవార్డును ఈ సినిమాకు ఇచ్చారు. ఈ కథ రాసింది. అన్నగారే కావడంతో ఆయనే నంది అవార్డును అందుకున్నారట. ఇదీ.. సంగతి!