తెలుగు చిత్ర పరిశ్రమలో వ్యాంప్ పాత్రలు చేసే నటీమణులు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వ్యాంప్ పాత్రలలో జ్యోతి, జయవాణి, కరాటే కళ్యాణి తో పాటు మరికొందరు నటీమణులు కనిపిస్తుంటారు. సాధారణంగా వ్యాంప్ పాత్రలు చేసే నటీమణులను తరచూ వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి. వీరిలో కరాటే కళ్యాణి ఇప్పటికే అలాంటి పాత్రలకు గుడ్ బై చెప్పి తాను ఇకపై సినిమాల్లో నటించనని స్పష్టం చేసింది. ప్రస్తుతం కరాటే కళ్యాణి రాజకీయాల్లో బిజీగా ఉంది. జ్యోతి విషయానికి వస్తే అడపదడపా పాత్రలు చేస్తూ అప్పుడప్పుడు వివాదాల్లో నిలుస్తుంటారు.
మరోవైపు జయవాణి సైతం వ్యాంప్ పాత్రలతో అభిమానులను సంపాదించుకున్నారు. జయవాణి గుంటూరు టాకీస్, పటాస్, పంచాక్షరి, భరత్ అను నేను, యమదొంగ చిత్రాల్లో నటించింది. చాలా సినిమాల్లో నటించినప్పటికీ గుంటూరు టాకీస్ లో ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత జయవాణి అంటే గుర్తుపట్టని వారు ఉండరు. తనకు సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చానని ఇక్కడ నిలదొక్కుకునేందుకు ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మిగిలిన అన్ని రంగాలతో పోలిస్తే చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయని వ్యాఖ్యానించింది.
సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నల్లగా ఉన్నావని…. నటిగా సెట్ అవ్వవు అని కొంతమంది అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో తనను తాను నిరూపించుకునేందుకు అనేక విధాలుగా మేకప్ ను ట్రై చేసే దానిని తెలిపింది. అవకాశాలు రావడం మొదలైన తర్వాత ఎంత చిన్న పాత్ర వచ్చినా తాను అంగీకరించేదాన్నని తెలిపింది. పాత్రకు 100% న్యాయం చేసేందుకే తాను ప్రయత్నించేదానినని వెల్లడించింది. సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయంలో తన కెరీర్ లో ఒక చేదు అనుభవం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఓ దర్శకుడు తనకు ఫోన్ చేసి మీకోసం ఒక క్యారెక్టర్ ఉందని పిలిచాడని తెలిపింది. దాంతో తాను అతడిని నమ్మి వెళ్లానని….. ప్రేమనగర్ సినిమాలో సినిమాలో రమాప్రభ లాంటి పాత్ర అని చెప్పి కాస్ట్యూమ్స్ లంబాడి తరహాలో ఉంటాయని చెప్పాడని తెలిపింది. ఒకసారి మీరు రోల్ కి సెట్ అవుతారో లేదో ముందుగా ఫోటోషూట్ చేయాలని చెప్పారని…. దాంతో తాను ఆ కాస్ట్యూమ్స్ తో ఫోటోషూట్ కు రెడీ అయ్యానంది. డిఫరెంట్ యాంగిల్స్‌లో చాలా ఫోటోలు తీశారని చెప్పింది. నాలుగైదు ఫోటోలు సరిపోతాయి కదా అని అంటే ఇది ఫోటోషూట్ కాదు అని చెప్పారని.. దాంతో తాను సరేనని షూట్ చేసి అక్కడనుండి వెళ్ళిపోయానని చెప్పింది.
కానీ ఆ తర్వాత తన అనుమతి లేకుండా ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో షేర్ చేశారని తెలిపింది. ఇక ఆ ఆఫీస్‌కి వెళ్తే అక్కడ దర్శకుడు, నిర్మాత, కెమెరామెన్ ఎవరూ లేరని దాంతో వాళ్లంతా కొత్త వాళ్ళని అర్థమైందని చెప్పింది. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తీసుకోలేదని దాంతో ఫోటోలు ఇంటర్నెట్ లోనే ఉండిపోయాయని చెప్పింది. ఆ ఫోటోలు తన కెరీర్ కు మచ్చగా మిగిలిపోయాయని జయవాణి ఆవేదన వ్యక్తం చేసింది.