మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతోంది. చిరు అభిమానుల జోష్ మరింత పెంచేలా ఆయన నటిస్తోన్న సినిమాలపై రెండు అప్‌డేట్స్ ఆదివారమే వచ్చేశాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటిస్తోన్న భోళాశంకర్ సినిమా పోస్టర్ బయటకు వచ్చింది. అలాగే ఈ సినిమాను వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించేశారు. ఇక ఈ రోజు సోషల్ మీడియాలో పలువురు చిరుకు బర్త్ డే విషెస్ చెపుతున్నారు.
ఇక చిరు ఇండస్ట్రీలోకి వచ్చి 44 ఏళ్లు అవుతోంది. చిరు హీరోగా నటించిన తొలి సినిమా పునాది రాళ్లు. అయితే ఆ సినిమా నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో పడడంతో ప్రాణం ఖరీదు ఏడో సినిమాగా రిలీజ్ అయ్యింది. చిరు తొలి సినిమా ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదలైంది. ఇక చిరు హీరోగా దూసుకుపోతోన్న టైంలో అప్పుడు టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఉన్న అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరుకు వివాహం జరిగింది.
నాలుగు దశాబ్దాలుగా చిరు – సురేఖ వైవాహిక బంధం అన్యోన్యంగా కొనసాగుతోంది. ఈ దంపతులకు సుస్మిత, శ్రీజ కుమార్తెలు. రామ్‌చరణ్ కుమారుడు. రామ్‌చరణ్ ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలలొ ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక చిరు సతీమణి సురేఖ కూడా తన భర్త నటించిన సినిమాల్లో ఆమెకు బాగా ఇష్టమైన సినిమాల గురించి ఇంట్లో ఇంటర్నల్‌గా చర్చిస్తూ ఉంటారట. అయితే ఇలాంటి విషయాలు తక్కువుగా బయటకు వస్తుంటాయి.
చిరు నటించిన రుద్రవీణ సినిమాలో పాటలు అంటే సురేఖకు చాలా ఇష్టమట. చిరుకు కూడా ఈ సినిమాలో పాటలు చాలా ఇష్టమట. ఈ సినిమా వచ్చినా చాన్నాళ్ల పాటు చిరు, సురేఖ ఇద్దరూ కూడా ఇవే పెట్టుకుని మరీ ఇష్టంగా వినేవారట. ముఖ్యంగా నమ్మకు నమ్మకు ఈరేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని ఈ పాట తనకు, సురేఖకు చాలా ఇష్టం అని చిరుయే చెప్పారు.