మెగాస్టార్ చిరంజీవి తన బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చిరుబర్త్ డే ట్రెండింగ్‌గా మారింది. ఈ క్రమంలోనే నిన్న చిరు సినీ కార్మికుల కోసం మంచి ప్రకటన చేశారు. వచ్చే యేడాది తన పుట్టిన రోజు నాటికి చిత్రపురి కాలనీలో తన తండ్రి పేరుతో సినీ కార్మికుల కోసం హాస్పటల్ నిర్మిస్తానని చిరు చెప్పారు. తనను మెగాస్టార్‌ను చేసిన కార్మికులు, ప్రేక్షకుల కోసమే ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు.
అయితే చిరు ఇలా ప్రకటన చేశారో లేదో వెంటనే దానికి సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి కుటుంబం నుంచి కౌంటర్ రావడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ రోజు ప్రభాకర్ రెడ్డి నలుగురు కుమార్తెలు ప్రెస్‌మీట్ పెట్టి చిరు వ్యాఖ్యలపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. టాలీవుడ్‌లో నిన్నటి తరం నటుడు ప్రభాకర్ రెడ్డి ఎంత గొప్ప నటుడో తెలిసిందే. ఆయన చిత్రపురి కాలనీ ఏర్పాటు కోసం తన వంతుగా ఎంతో కష్టపడ్డారు.
ఈ కాలనీకి కూడా ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అన్న పేరు ఉంది. దీనిపై ఆయన కుమార్తెలు శైలజారెడ్డి, విశాలాక్షి, రాధారెడ్డి, లక్ష్మిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేరును చెరిపేసే ప్రయత్నాలు జరగడం బాధాకరమన్నారు. ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకకు అప్పటి ముఖ్యమంత్రులతో మాట్లాడి మా నాన్న ఎంతో కష్టపడ్డారని వాళ్లు చెప్పారు.
అంత చేసినా కూడా తమ తండ్రి పేరు లేకుండానే చిత్రపురి కాలనీ అని ఇండస్ట్రీ పెద్దలు చెపుతుంటారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తమ తండ్రి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చిత్రపురి కమిటీకి 2 యేళ్ల క్రితమే నివేదిక పంపి.. అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. ఇప్పుడు ఇండస్ట్రీకే చెందిన ఓ ప్రముఖ వ్యక్తి వచ్చి తన తండ్రి పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని చెప్పడం బాధాకరమని వారు తెలిపారు.
తమ తండ్రి పేరును పూర్తిగా తొలగించే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందని వారు చెప్పారు. పేద కళాకరుల కోసం ఆసుపత్రి ఏర్పాటును తాము వ్యతిరేకించడం లేదని.. తాము చెప్పిన ఆసుపత్రి ఏర్పాటు కోసం స్థలం ఎక్కడ కేటాయించాలన్న చర్చలు జరుగుతుండగానే… తన తండ్రి పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఆ సినీ ప్రముఖుడు ప్రకటించుకోవడం సరికాదని చిరుకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.