మహానటి సావిత్రి.. అన్నగారు ఎన్టీఆర్.. కాంబినేషన్ అంటే అప్పట్లో థియేటర్లు కిక్కిరిసిపోవాల్సిందే. ఇప్పుడంటే.. ఆన్‌లైన్ టికెట్లు వచ్చేశాయి. అప్పట్లో థియేటర్లకు వెళ్లి.. పడిగాపులు పడిమరీ.. టికెట్లు కొనాల్సిందే. పైగా ఇప్పట్లా.. రవాణా సదుపాయం కూడా పెద్దగా అందుబాటులో లేదు. దీంతో అభిమానులు… ఎడ్ల బండ్లు కట్టుకుని మరీ.. సినిమా హాళ్లకు వచ్చేవారు. లైన్‌లో నిలబడి మరీ.. అన్నగారి సినిమాలకు టికెట్లు తీసుకునేవారు. ఫస్ట్ షో చూసి తీరాల్సిందే.. అని ఇప్పుడు కుర్రాళ్లు ఎలా ముచ్చటపడుతున్నారో తెలిసిందే.
గతంలో అయితే..కుర్రాళ్ల కన్నా ఎక్కువగా నడివయస్కులు, వృద్ధులు కూడా ఎన్టీవోడి సినిమా.. ఫస్ట్ సినిమా చూసేందుకు ఎగబడేవారు. లవకుశ సినిమా టిక్కెట్ల కోసం ఉదయం 6 గంటల నుంచే క్యూలో ఉండి ఒక్క టిక్కెట్ దొరికితే పెద్ద పండగ చేసుకునే వారట అప్పట్లో..! ఇక, సావిత్రి.. ఎన్టీఆర్ కాంబినేషన్ అయితే.. ఇక చెప్పాల్సిన పనేలేదు. వారిద్దరూ ఉన్నారంటే.. ఆ సినిమా రెండు వందల రోజులు ఆడితీరుతుందనేది నిర్మాతల నమ్మకం కూడా. అందుకే.. వారి కాంబినేషన్ సినిమాలకు చాలా డిమాండ్ ఉండేది. ఇలా.. అన్నగారు పదుల సంఖ్యలోనే సావిత్రితో నటించారు.
అయితే.. ఒకానొక సందర్భంలో మాత్రం.. అన్నగారు సావిత్రమ్మ వద్దులే.. అనేశారట. సావిత్రిని అందరూ .. సావిత్రి అని పిలిస్తే.. అన్నగారు.. సావిత్రమ్మ.. అని పిలిచేవారట. లేకపోతే నాగయ్య అన్నట్టుగా పెద్దమ్మాయ్ అని పిలిచేవారట. తిరుపతమ్మ కథ సినిమా తీయాలని.. అన్నగారు భావించారు. దీనికి తానే నిర్మాతగా ఉండాలని భావించారు. కృష్ణా జిల్లాకు చెందిన తిరుపతమ్మ దేవాలయం అంటే.. అన్నగారికి మక్కువ. అన్నగారు సీఎం అయిన తొలి నాళ్లలో తిరుపతికి, తిరుపతమ్మ ఆలయానికే వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
ఇలా.. తిరుపతమ్మ చిత్రాన్ని అనుకున్నాక.. మరో నిర్మాత ముందుకు వచ్చి.. తాను తీయాలని అనుకుం టున్నాని.. సావిత్రమ్మను మిమ్మల్ని పెట్టి తీస్తానని చెప్పారట. కానీ.. అన్నగారు మాత్రం .. సావిత్రమ్మ వద్దులే అనేశారట. దీంతో అవాక్కయిన నిర్మాత అన్నగారు చెప్పినట్టు కృష్ణకుమారిని హీరోయిన్‌గా పెట్టారు. అయితే..సావిత్రమ్మను ఎందుకు వద్దన్నారనేది మాత్రం మిస్టరీనే.
అయితే.. అప్పటికే ఆమె మద్యానికి బానిస కావడంతో.. పవిత్రమైన తిరుపతమ్మ.. పాత్రను ఆమెతో చేయించడం ఇష్టం లేకే.. అన్నగారు వద్దని ఉంటారని.. ఇప్పటికీ అనుకుంటారు. అయితే.. కారణం మాత్రం ఇప్పటికీ.. ఎవరికీ తెలియదు. ఇదీ.. సంగతి!! సంప్రదాయాలకే కాదు.. కట్టుబాట్లకు కూడా అన్నగారు అంతే ప్రాధాన్యం ఇచ్చేవారన్నమాట.