విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్.. జీవితం అందరూ అనుకున్నట్టుగా వడ్డించిన విస్తరికాదు. ఆయన సినిమాల్లోకి రాకముందు.. చదువు కోసం.. తిప్పలు పడ్డారు. చేతిలో రూపాయి లేక ఇబ్బంది పడ్డారు. సినిమాల్లోకి వచ్చాక అవకాశం కోసం ఎదురు చూశారు. “పల్లెటూరు పిల్లాడికి వేషం ఏమిస్తాం“ అనే కామెంట్లను విని.. తట్టుకుని.. తనను తాను నిరూపించుకునేందుకు ఎన్నో అవస్థలు పడ్డారు. అనేక సందర్భాల్లో ఒక పూటే తిని పడుకున్నారు. పట్టుదలతో నటనపై దృష్టి పెట్టి.. విశ్వవిఖ్యాతి గడించారు. ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నారు.
అయితే.. అప్పుడు కూడా ఆయనకు ఇబ్బందులు తప్పలేదు. స్వాభిమానాన్ని చంపుకొని చేయాల్సిన పాత్రలు ఎదురయ్యాయి. అయితే.. వాటిని కూడా ఎదరించి.. తన సత్తాను చాటుకున్నారు. ఇక… వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఇద్దరు పిల్లలు చాలనుకున్న ఎన్టీఆర్‌కు ఏకంగా 8 మంది సంతానం కలిగే పరిస్థితి వచ్చింది. భారీ సంతానం కారణంగా.. భార్య అనారోగ్యం పాలయ్యారు. ఈ పరిస్తితిని తట్టుకుని.. సినిమాల్లో రాణించేందుకు తనే స్వయంగా ఇంట్లో పనులు చేసుకునే పరిస్థితిని ఎన్టీఆర్ ఎదుర్కొన్నారు. భార్య మరణం నాటికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.
అయితే.. ఆ తర్వాత ఓటమి కూడా చెందారు. ఎంత ఎత్తుకు ఎదిగారో.. అంతే పతనావస్థకు చేరుకున్నారు. ఈ దశలో అన్నగా రు.. అన్నింటినీ వదిలేసి.. సన్యాసం తీసుకుందామని అనుకున్నారు. దీనికి సంబంధించి ఆయన ఏకంగా కలకత్తా వెళ్లి రామకృష్ణ మఠం నిర్వాహకులతోనూ చర్చించారు. ఇక్కడే ఆయనకు కాషాయం కట్టడం అలవాటైంది. అయితే.. మరో వారం పది రోజుల్లోనే సన్యాసం తీసుకుంటారని అనుకుంటుండడగా.. అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది.
లక్ష్మీపార్వతి పరిచయం ఏర్పడింది. దీంతో ఆయన సన్యాసం తీసుకుందామనే ఆలోచనను పక్కన పెట్టారు. అనంతరం.. ఆయన మరో జీవితానికి స్వాగతం పలికారు. ఇక్కడ కూడా ఆయన జీవితం సవ్యంగా సాగింది లేదు. ఆయన లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకోవడం కుటుంబంలోనే చాలా మందికి ఇష్టం లేదు. లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అయినా.. ఒకరిద్దరి.. మద్దతుతోనే అన్నగారు ఆమెను వివాహం చేసుకున్నారు.
ఈ దశలోనే ఆస్తుల పంపకం.. తెరమీదికి వచ్చింది. సాధ్యమైనంత వరకు గుట్టుచప్పుడు కాకుండా.. అన్నగారు ఆస్తులు పంచేశారు. చివరి దశలో ఉన్న ఆస్తులను లక్ష్మీ పార్వతికి రాశారనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఆయనతో దూరం పాటించారు. ఇలా.. అన్నగారి జీవితంలో ప్రతి మలుపులోనూ అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయంటే.. ఆశ్చర్యం వేస్తుంది