ఎవరికైనా.. వారసులపైనా.. తమ వారసత్వంపైనా..అనేక ఆశలు ఉంటాయి. ముఖ్యంగా నాటక.. సంగీత రంగంలో ఉన్నవారికి.. వారసత్వంపై ఇంకా ఆశలు ఉంటాయి. ఇలానే అన్నగారు ఎన్టీఆర్‌కు కూడా .. వారసులపై అనేక ఆశలు ఉన్నాయి. నిజానికి అప్పట్లో.. వారసులను వెండితెరకు పరిచయం చేయడం అంటే.. సాహసంతో కూడుకున్న పని. దర్శకులు నిర్మాతలు అస్సలు ఒప్పుకొనేవారు. “ముందు.. నాలుగు నాటకాలు ఆడి రమ్మనండి..చూద్దాం“అని నిర్మొహమాటంగా చెప్పేవారు.
ఈ కారణంగానే అప్పటి నటుల్లో గుమ్మడి, రంగారావు, రాజనాల, రేలంగి వంటివారు.. తమ వారసులను రంగంలోకి తీసుకురాలేదు. దీనికితోడు.. పెడ దోవలు పడతారనే భయం కూడా ఉండేది. ముఖ్యంగా ప్రేమలు.. పేకాటలు.. జూదాలు.. మద్యం వంటివి పెను భయంగా అప్పట్లో చెప్పుకొనేవారు. అందుకే.. ఎవరూ తమ వారసులను రంగంలోకి తీసుకురాలేదు. కానీ. అన్నగారు ఆ ప్రయత్నం చేశారు. బాల నటుల నుంచే తన కుమారులను ప్రోత్సహించారు.
ముఖ్యంగా పెద్దకుమారుడు హరికృష్ణపై.. అన్నగారు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. తనలాగే.. కృష్ణుడుగా.. రాముడిగా.. ఇమిడిపోయి.. ప్రజలతో జేజేలు పలికించుకోవాలని.. ఆకాంక్షించారు. అయితే.. అనూహ్యంగా కౌమార దశలో వచ్చినజ్వరం కారణంగా.. ముఖంపై స్పోటకపు మచ్చలు వచ్చాయి. దీంతో చాలా ఏళ్లపాటు.. నటనకు దూరంగా ఉన్నారు. పైగా.. పెద్దగా చదువు కూడా రాలేదని.. అన్నగారు బాధపడేవారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. తన వెంటనే ఉంచుకునేవారు.
చైతన్య రధానికి డ్రైవర్‌గా.. పనిచేశారు. తర్వాత.. పార్టీలోనూ.. తీసుకున్నారు. ఇక, ఆతర్వాత..అన్నగారి ఆశలు.. బాలయ్యపై పడ్డాయి.. తనంతటి వాడు కావాలని ఆకాంక్షించారు. ఆయన అనుకున్నట్టుగానే.. కృష్ణుడిగా.. రాముడిగా.. బాలయ్య అందరినీ అలరించి.. రికార్డు సృష్టించడం గమనార్హం. ఇప్పటికీ.. తెలుగు తెరపై బాలయ్య ప్రభంజనం కొనసాగుతుండడం అన్నగారి ఆశీర్వాద బలమేనని అంటారు.