Moviesఎన్టీఆర్ ' ఆత్మ‌బంధువు ' సినిమాకు బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాకు ఉన్న...

ఎన్టీఆర్ ‘ ఆత్మ‌బంధువు ‘ సినిమాకు బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాకు ఉన్న లింక్ తెలుసా..!

క‌థానాయ‌కుడు లాంటి సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్లో బాల‌కృష్ణ న‌టించిన రెండో సినిమా రాము. ఈ సినిమాతో అప్ప‌టి వ‌ర‌కు సురేష్ బ్యాన‌ర్లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న వై. నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. అంత‌కుముందు ఆయ‌న క‌థానాయ‌కుడు, ప్ర‌తిధ్వ‌ని, సంఘ‌ర్ష‌ణ సినిమాల‌కు అసిస్టెంట్‌గా ప‌నిచేశారు. క‌థానాయ‌కుడు సినిమా చేస్తోన్న టైంలోనే నాగేశ్వ‌ర‌రావుపై బాల‌య్య‌కు గురి, న‌మ్మ‌కం కుదిరాయి.

ఆ స‌మ‌యంలోనే నిన్ను డైరెక్ష‌న్ చేస్తాన‌ని ఆయ‌న‌కు హామీ ఇచ్చార‌ట‌. బాల‌య్య తాను ఇచ్చిన మాట‌ను రాము సినిమాతో నిజంగానే నిల‌బెట్టుకున్నారు. అప్పటికే బాల‌య్య మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అలాంటి హీరోతో రాము అన్న సాఫ్ట్ టైటిల్ ఏంటా ? అన్న సందేహాలు కొంద‌రు వ్య‌క్తం చేశారు. అయితే నాగేశ్వ‌ర‌రావు మాత్రం క‌థ‌ను బ‌లంగా న‌మ్మారు. రామానాయుడు కూడా ఆయ‌న‌కు ఛాన్స్ ఇచ్చారు.

బాల‌య్య తండ్రి ఎన్టీఆర్ ఆత్మ‌బంధువు సినిమా ప్రేర‌ణ‌తో రాము క‌థ‌ను ప్ర‌ముఖ త‌మిళ ర‌చ‌యిత గుహ‌నాథ‌న్ రాశారు. ఇక రాము అన్న టైటిల్ పెట్టింది జంధ్యాల‌. బాల‌య్య‌కూ కూడా క‌థ న‌చ్చ‌డంతో ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను నాగేశ్వ‌ర‌రావుకు అప్ప‌గించారు రామానాయుడు. 1987 ఫిబ్ర‌వ‌రి 1న రాము షూటింగ్ ఊటీలో స్టార్ట్ చేశారు. అక్క‌డ పాట‌లు పూర్తి చేసిన వెంట‌నే హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు.

ఈ సినిమాలో హీరో చిన్న‌ప్పుడు మూగ‌వాడికి ఉంటాడు. ఆ త‌ర్వాత త‌న‌ను కాపాడిన కుటుంబాన్ని ఓ దుర్మార్గుడు భారి నుంచి ఎలా కాపాడాడు ? అన్న క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలో రాముగా బాల‌య్య చ‌క్క‌ని న‌ట‌న క‌న‌ప‌రిచాడు. బాల‌య్య‌కు జోడీగా ర‌జ‌నీ న‌టించింది. అప్ప‌ట్లో వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఎన్నో హిట్ సినిమాలు వ‌చ్చాయి.

జంధ్యాల మాట‌లు, వేటూరి పాట‌లు రాసిన ఈ సినిమాకు ఫిల్ల‌ర్లుగా నిలిచాయి. 1987 జూలై 31 విడుద‌లై స‌క్సెస్‌ఫుల్‌గా 100 రోజులు ఆడింది. మ‌రో హైలెట్ ఏంటంటే ఈ సినిమాకు ప్ర‌ముఖ గాన‌గంధ‌ర్వ ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం సంగీతం స‌మ‌కూర్చారు. సురేశ్ సంస్థ‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా బాలు ప‌నిచేసిన ఏకైక సినిమా ఇదే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news