టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్‌గా కృష్ణవంశీకి ఉన్న ప్రత్యేక స్థానం గురించి అందరికీ తెలిసిందే. ఆయన తీసింది తక్కువ సినిమాలే అయినా మార్కెట్ విపరీతంగా ఏర్పరుచుకున్నారు. గులాబి సినిమాలో ఒకే ఒక్కపాట చూసి నాగార్జున నిన్నే పెళ్ళాడతా సినిమా అవకాశం ఇచ్చారు. మురారి, సముద్రం, ఖడ్గం లాంటి భారీ హిట్ సినిమాలు తీసి తనకంటూ ఓ స్పెషాలిటీని సంపాదించుకున్నారు. అయితే, గత కొన్నేళ్ళుగా కృష్ణవంశీ సినిమాలు పెద్ద ఆదరణ పొందలేకపోతున్నాయి.
ఏ సినిమా తీసినా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగులుతుంది. పైసా, నక్షత్రం లాంటి సినిమాలు చాలా సమయం తీసుకున్నారు కృష్ణవంశీ. అయినా ఫలితం అందరికీ తెలిసిందే. దాంతో కృష్ణవంశీ ఊపు బాగా తగ్గిపోయింది. అటు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఛాన్స్ ఇచ్చినా గోవిందుడు అందరివాడేలే సినిమా కూడా అనుకున్నట్టుగా సక్సెస్ కాలేదు. ఇక ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ, కరోనా కి ముందు రంగ మార్తాండ సినిమాను ప్రకటించారు.
సాధారణంగా కృష్ణవంశీ పరభాషా కథల మీద ఆసక్తి చూపించరు. సొంత కథలతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు గ్యాప్ రావడం వల్లనో లేక ఆ కథ విపరీతంగా నచ్చో గానీ, మరాఠీలో భారీ హిట్ అందుకున్న నట సామ్రాట్‌ను తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్సైయ్యారు. నానాపటేకర్ ప్రధాన పాత్ర పోషించిన నట సామ్రాట్ సినీ ప్రముఖుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇదే కథను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కాస్త మార్పులు చేర్పులు చేసి రంగ మార్తాండని రూపొందిస్తున్నారు.
అయితే, ఈ సినిమాలో తన భార్య రమ్యకృష్ణను ప్రధాన పాత్రకు తీసుకోవడం ఆసక్తికరమైన విషయం.
ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, వంశీ చాగంటి, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మూల కథ మొత్తం రమ్యకృష్ణ మీదే సాగుతుంది. అయితే, ఈ సినిమాలో రమ్యకృష్ణ తప్ప ఇంకెవరు చేసినా ఆ ఇంపాక్ట్ రాదని కృష్ణవంశీ గట్టిగా నమ్మారు.
అదీ కాక కథలోని పాత్ర అనుకున్నప్పటి నుంచే రమ్యకృష్ణ తప్ప మరొకరు మైండ్‌లో రాలేదట. అన్నిటికంటే కూడా కృష్ణవంశీ సినిమాను నిలబెట్టాలంటే… ఇప్పుడు ఆమె తప్ప మరో అవకాశం లేదనే 20 ఏళ్ళ తర్వాత రమ్యకృష్ణను రంగమార్తాండ సినిమాకు తీసుకున్నారు. చూడాలి మరి ఆయనకు తన భార్య వల్ల ఎలాంటి సక్సెస్ దక్కుతుందో..!