నందమూరి అభిమానుల్లో ఇప్పుడు తిరుగులేని జోష్ వచ్చేసింది. గత ఆరు నెలల కాలంలో నందమూరి హీరోలు నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ముందుగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత అసలు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా ? రారా అన్న సందేహాలను పటా పంచలు చేస్తూ బాలయ్య అఖండ సినిమాతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశారు. అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.
ఇక మార్చిలో ఎన్టీఆర్.. రామ్ చరణ్ తో కలిసి నటించిన పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్ ప్రేక్షకులకు ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ కెరియర్ లో ఇదే తొలి పాన్ ఇండియా హిట్ సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక తాజాగా టాలీవుడ్ లో వరుస ప్లాపులు వస్తున్నవేళ మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన సోషియో ఫాంటసీ, చారిత్రాత్మక సినిమా బింబిసారా వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తోంది. శుక్రవారం రిలీజైన బింబిసారాకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే టాక్ వచ్చేసింది.
అయితే ఈ మూడు సినిమాల విషయంలోనూ ఒక కామన్ పాయింట్ ఉందన్న విషయం ఇప్పుడు చర్చకి వస్తుంది. ఈ మూడు సినిమాల్లోనూ పాప సెంటిమెంట్ ఉంది. ఇది ఈ సినిమాల విజయంలో కీలకపాత్ర పోషించింది. తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాలో ఓ చిన్న పిల్ల చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది. ఆ పిల్లను కాపాడటం కోసం కళ్యాణ్ రామ్ కథలో కీలకంగా మారతాడు. అలాగే గత డిసెంబర్లో వచ్చిన బాలయ్య అఖండ సినిమాలో కూడా ఓ పాప చుట్టూ కథ తిరుగుతుంది.
అంతేకాదు చివరలో నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ? వెంటనే వస్తానని చెప్పి అఖండ సీక్వెల్ కు కూడా ప్లాన్ చేశారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో అసలు ఎన్టీఆర్ పోరాటం అంతా ఓ గోండు పిల్ల కోసమే..! ఆ పిల్ల చుట్టూనే కథ తిరుగుతుంది. ఆ పిల్లను తమ గూడెంకు తిరిగి తీసుకురావడానికి బ్రిటిష్ వాళ్ళను ఎదిరించడానికి ఎన్టీఆర్ ఢిల్లీ వెళతాడు.
అలా ముగ్గురి నందమూరి హీరోల సినిమాల్లో పాప పాత్ర కీలకంగా మారగా… ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవటం విశేషం. దీంతో ఇప్పుడు నందమూరి హీరోలకు పాప సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యిందన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.