టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె. దేవీవరప్రసాద్ ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. చిరుతో చట్టంతో పోరాటం – కొండవీటి రాజా – మంచి దొంగ – ఘరానా మొగుడు వంటి బిగ్గెస్ట్ హిట్స్ తీశారు. ఘరానా మొగుడు తర్వాత చిరుతో మరో సినిమా తీయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే చిరు వెంటపడి మరీ ఆయనతో అల్లుడా మజాకా సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకుడు. చిరు – ఈవీవీ కాంబినేషన్లో వచ్చిన ఏకైక సినిమా ఇదే.
ఈవీవీకి ఈ ఛాన్స్ కూడా అనుకోకుండా వచ్చింది. ఈవీవీ డైరెక్ట్ చేసిన అప్పుల అప్పారావు సినిమా చూసి ఈవీవీని తన ఇంటికి పిలిచారు చిరంజీవి. ఆ మరుసటి రోజు ఈవీవీని దేవీవరప్రసాద్ తన ఇంటికి పిలిచారు. బడ్జెట్ పరిమితి లేకుండా మీరు మా బ్యానర్లో ఓ సినిమా చేయాలి.. అందులో చిరంజీవి హీరోగా నటిస్తారని చెప్పారు. వెంటనే ఆనందంతో ఎగిరి గంతేసిన ఈవీవీ.. చిరుతో సినిమా అంటే మామూలు కథ ఉండకూడదు.. ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా మంచి కథ ఉండాలని ఆ కథ కోసమే రెండేళ్లు వెయిట్ చేశారు.
మంచి కథ దొరికిన వెంటనే చిరుకు వినిపించారు. సింగిల్ సిట్టింగ్‌లోనే కథ ఓకే అయ్యింది. అదే అల్లుడా మాజాకా సినిమా. ఈ కథ రాసింది రచయిత పోసాని కృష్ణమురళీ. ఘరానా అత్తకు, గడుసు అల్లుడికి మధ్య జరిగే డ్రామాతో ఈ సినిమా కథ ఉంటుంది. ముందుగా అత్త పాత్ర కోసం సీనియర్ నటి వాణిశ్రీని అనుకున్నారు. అయితే ఆమె డేట్లు కుదరకపోవడంతో మరో సీనియర్ హీరోయిన్ లక్ష్మిని అత్త పాత్రకు తీసుకున్నారు.
చిరుకు జోడీగా హీరోయిన్లుగా రమ్యకృష్ణ, రంభ నటించారు. మెగాస్టార్ సరసన రంభ నటించిన తొలి సినిమా ఇదే. ఇక మరో విశేషం ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టింది ఎవరో కాదు.. నటరత్న ఎన్టీఆర్. ఆగస్టు 26, 1994న నటరత్న ఎన్టీఆర్ చేతుల మీదుగా సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమా నిర్మాత కె. దేవీ వరప్రసాద్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయన కోరిక మేరకు ఎన్టీఆర్ వచ్చి మరీ క్లాప్ కొట్టారు. 1995 ఫిబ్రవరి 25న విడుదలైన అల్లుడా మజాకా చిరు కెరీర్‌లో మాస్ హిట్‌గా నిలిచిపోయింది.