తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సీతారామం. ఈ సినిమాలో రష్మిక పోషించిన పాత్రకు రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన రెండవ తెలుగు స్ట్రైట్ మూవీ ఇది. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమ గాథ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకొని తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు.
హను రాఘవపూడి సినిమాలంటే సున్నితమైన కథ కథానలతో మంచి ఎమోషనల్ సన్నివేశాలు బలమైన పాత్రలు..ప్రేక్షకులందరినీ కట్టి పడేసే కథ-కథనాలు అన్నీ ఉంటాయి. ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న హను ఇప్పుడు రూపొందించిన సీతారామం సినిమాతోనూ ఆకట్టుకున్నారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఆయనను అభినందిస్తున్నారు. ఎప్పటిలాగే కమర్షియల్ హంగులకు పోకుండా ఎమోషనల్ కంటెంట్ మీదే ఆధారపడి సీతారామం సినిమాను తీశారు.
ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నలకు మంచి పేరు దక్కుతోంది. ఇప్పటి వరకు రష్మిక పక్కా కమర్షియల్ సినిమాలనే చేస్తూ వచ్చింది. వాటితోనే పాన్ ఇండియన్ రేంజ్లో హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది. భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోయిన్స్‌లో ముందు వున్న హీరోయిన్ రష్మిక. అలాంటి క్రేజ్ ఉన్న రష్మిక సీతారామం సినిమాలో ఆఫ్రీన్ అనే ముస్లిం యువతి పాత్రలో నటించింది.
అయితే, ఈ సినిమాలో రష్మిక నటిస్తుందని తెలియగానే ఎందుకు రిస్క్ చేస్తుందని అభిమానులే కామెంట్స్ చేశారు. అంతేకాదు, కమర్షియల్ హీరోయిన్గా మంచి క్రేజ్ ఉన్న సమయంలో సీతారామం సినిమా ఒప్పుకొని తప్పు చేసిందని మాట్లాడారు. కానీ, తాజాగా ఈ సినిమా చూసి వారే రష్మిక తీసుకున్న నిర్ణయం అభినందనీయమని మెచ్చుకుంటున్నారు. కథలో కీలకంగా వచ్చే రష్మిక పాత్ర అద్భుతంగా ఉందని..ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా కూడా కెరీర్లో మైల్ స్టోన్‌గా మిగిలిపోయే సీతారామం లాంటి ఒక్క సినిమా చేసినా అది వేరే అని పొగడ్తలతో ముంచేస్తున్నారు.