తెలుగు సినిమా రంగంలో పైకి కనిపించేది అంతా మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పిచూడు పురుగులుండు అన్నట్టుగానే ఉంటుంది. పైకి ఎవరికివారు అంతా కలిసికట్టుగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడటం లేదు. పైకి చెప్పేవి అన్నీ శ్రీరంగనీతులు మాత్రమే అన్నట్టుగా ఉంది. తెరవెనక మాత్రం ఎవరికి వారు చేయాల్సిన రాజకీయాలు అన్నీ చేస్తున్నారు.
ఏ హీరోకు అయినా ఒక హిట్ వస్తే వెంటనే అందరూ అభినందనలు.. శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ ఉంటారు. కానీ తెర వెనక నడిచే రాజకీయం వేరుగా ఉంటుందన్నది.. జగమెరిగిన సత్యం. ఇక టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య కూడా ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడటం లేదు. పైకి మాత్రం తమ అవసరాల కోసం కలిసి ఉన్నట్టు స్నేహం పేరుతో నటిస్తున్నారు అంతే..!
తాజాగా టాలీవుడ్ లో గిల్డ్ దెబ్బతో నిర్మాతలు రెండుగా చీలిపోయారు. అటు హీరోలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా రెండు వర్గాలుగా ఉన్నారు. ఇక ప్రతిరోజు టాలీవుడ్ లో ఏదో ఒక పార్టీ పేరుతో అందరూ కలుస్తున్నారు. కాస్త మందు లోపలకు వెళ్లిన వెంటనే వారి మధ్య లేనిపోని డిస్కషన్లు జరిగి ఒకరి గురించి మరొకరు తీవ్రంగా దుమ్మెత్తి పోసుకునేవరకు వస్తుందట.
తాజాగా గిల్డ్ సభ్యులు అందరూ కలిసికట్టుగా సినిమా షూటింగులు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఈ నిర్ణయం తీసుకున్న వారిలోనే కొందరు ఆ నిబంధనలు ఉల్లంఘించి మరీ షూటింగులు జరిపేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒక పెద్ద నిర్మాణ సంస్థలో భాగస్వామిగా ఉన్న సోదరుడి పుట్టినరోజు పార్టీ జరిగింది. అమెరికాలో ఉండే ఆ నిర్మాత తన పుట్టినరోజు కోసం ఇక్కడికి వచ్చారు.
ఈ పార్టీలో అందరూ మద్యం మత్తులో బాగా ఎంజాయ్ చేశారట. వీరి మధ్య కూడా గిల్డ్ విషయాలు, సినిమా షూటింగుల బంద్ విషయాలు ప్రస్తావనకు వచ్చాయట. ఇక్కడ మాట మాట పెరగడంతో ఒక నిర్మాత బీర్ బాటిల్ విసరగా… మరో నిర్మాత కూడా ఇంకో బీర్ బాటిల్ విసిరేసాడట. ఈ బాటిల్ వెళ్లి అక్కడే ఉన్న మరో నిర్మాత షర్టు మీద పడి అంతా రచ్చ రచ్చ జరిగిందట.
ఒక సీనియర్ బడా నిర్మాత నువ్వు తీసేవి బోకు సినిమాలు అంటే… మరో పెద్ద నిర్మాత నీ సినిమాలు అంత పెద్ద బూతు పురాణం అని అన్నట్టు కూడా మాటల తూటాలు పేలాయట. దీంతో పక్కనే ఉన్నవారు వారిద్దరికీ సర్ది చెప్పారని తెలిసింది. ఏదేమైనా ఇండస్ట్రీలో అంతర్గత వ్యవహారాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో చెప్పేందుకు ఈ సంఘటనే పెద్ద నిదర్శనం. వీళ్ళు పైకి నీతులు చెబుతూ లోపల మాత్రం కత్తులు నూరుకుంటున్నారు.