సినిమా రంగంలో ఉన్నవారికి ఆత్మీయులు ఎవరు ఉంటారు? అంటే.. ఏరంగంలో ఉన్నవారికి ఆ రంగంలో నే ఆత్మీయులు ఉంటారు కనుక.. అన్నగారికి కూడా.. సినిమా వాళ్లే ఆత్మీయులు అని ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. అన్నగారి విషయంలో మాత్రం ఒక్క సినిమా వాళ్లే కాదు.. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో.. తాను గతంలో పనిచేసిన ప్రాంతంలో తనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మీ యులే. ఎవరు తనను చూసేందుకు మద్రాస్ వచ్చినా.. అన్నగారి ఆత్మీయత చాలా డిఫరెంట్‌గా ఉండేది.
సినిమాల్లోకి రాకముందు.. అన్నగారు.. పాలు పెరుగు వ్యాపారం చేసిన విషయం తెలిసిందే. బెజవాడ.. గాం ధీనగర్‌లో ఉన్న బాబాయ్ హోటల్‌కు పాలు సరఫరా చేసేవారట. ఈ క్రమంలోనే బాబాయ్ హోటల్‌తో అన్నగారికి అనుబంధం పెరిగింది. అదేవిధంగా అన్నగారు పుట్టి పెరిగిన.. నిమ్మకూరు.. వాస్తవ్యులతోనూ అనుబంధం పెరిగింది. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా ఎన్టీఆర్ అంటే.. మహా ఇష్టం. అనంతర కాలంలో అన్నగారు సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా ఈ అనుబంధాలు కొనసాగించారు.
అంతేకాదు.. ప్రత్యేకంగా అన్నగారిని చూసేందుకు ఏటా ఒక బృందం.. మద్రాస్‌కు వెళ్లేది. దీనికి బాబాయ్ హోటలే వేదిక అయ్యేది. వెళ్లాలనుకున్న వారు బాబాయ్ హోటల్ దగ్గర కలుసుకుని.. అక్కడికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్‌కు వెళ్లి.. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో మద్రాసుకు వెళ్లేవారు. అయితే.. వీరంతా వెళ్లే ముందు ..అన్నగారికి సమాచారం ఇచ్చేవారు. దీంతో ఇక్కడ వీరు బయలు దేరగానే.. మద్రాస్‌లో అన్నగారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. వీరి కోసం ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించేవారు.
అంతేకాదు.. వీరి కోసం.. వాహిని స్టూడియోలో రూంలు కూడా బుక్ చేసి పెట్టేవారు. మద్రాస్ వంటకాలను ప్రత్యేకంగా రుచి చూపించి.. స్టూడియోలన్నీ తిప్పి..వారికి కనువిందు చేసేవారు. ఇలా.. ప్రతి ఏటా.. అన్న గారు విజయవాడలో తనకు పరిచయం ఉన్నవారు వస్తే.. కాదనకుండా.. ఆతిథ్యం ఇచ్చేవారు. ముఖ్యంగా బాబాయ్ హోటల్ బృందం వెళ్తే.. అన్నగారికి మహా సంతోషంగా ఉండేది. దీంతో బాబాయ్ హోటల్‌కు పాలు పోయడం మానేసినా.. ఇక్కడివారితో మాత్రం అన్నగారు కలిసిమెలిసి ఉండేవారనడంలో సందే హం లేదు.