అందాల రాశి దివ్యభారతి మరణించి ముప్పై ఏళ్లు గడుస్తోంది. అప్పట్లో దివ్యభారతి ట్రెండింగ్ హీరోయిన్. కేవలం పంతొమిదేళ్ల వయసులోనే తన అందం నటనతో బాలీవుడ్ ను షేక్ చేసింది. దిల్ కా క్యా కసూర్, దివానా, రంగ్ లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా తెలుగులో బొబ్బిలిరాజా, రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ, ధర్మక్షేత్రంతో సహా మరికొన్ని సినిమాల్లో నటించి టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇక చిన్న వయసులోనే స్టార్ డమ్ ను చూసిన దివ్యభారతి పంతొమిదేళ్ల వయసులోనే భవనం పై నుండి పడి మరణించింది.
అప్పట్లో దివ్యభారతి మరణం దేశవ్యాప్తంగా ఓ సంచలనం రేపింది. అర్దరాత్రి దివ్యభారతి భవనంపై నుంచి మరణించడంతో మిస్టరీ డెత్ గా కేసు నమోదు అయ్యింది. ఇప్పటికీ ఈ కేసును ముంబై పోలీసులు చేదించలేకపోయారు. 1993 ఎప్రిల్ 5వ తేదీన దివ్యభారతి మృతిచెందింది. ఆ రోజు దివ్యభారతి చెన్నైలో షూటింగ్ పూర్తి చేసుకుని తన తల్లిదండ్రుల కోసం ఓ అపార్ట్ మెంట్ కొనేందుకు తిరిగి ముంబైకి చేరుకుంది. అక్కడ తన సోదరుడితో కలిసి ఓ ఫ్లాట్ చూసింది. ఆ మరుసటి రోజు దివ్యభారతి హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.
కానీ తాను అలసిపోయానని నిర్మాతలకు ఫోన్ లో చెప్పి షూటింగ్ లను క్యాన్సిల్ చేసుకుంది. అప్పుడే దివ్యభారతికి ప్రముఖ డిజైనర్ నీతా లల్లూ ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నామని చెప్పారు. దాంతో దివ్యభారతి వాళ్లను రమ్మని చెప్పి డ్రింక్స్ సిద్దం చేసింది. నితా లల్లూ వచ్చిన తరవాత ముగ్గురూ కలిసి మద్యం తీసుకున్నారు. మాట్లాడుతుండగానే దివ్యభారతి నడుచుకుంటూ వెళ్లి బాత్రూం వద్ద తెరిచి ఉన్న కిటికీ వద్ద నుండి కింద పడింది.
ఐదో అంతస్థు నుండి దివ్యభారతి కిందపడటంతో ఒక్కసారిగా వచ్చిన శబ్దానికి అపార్ట్మెంట్ వాసులు బయటకు వచ్చారు. వెంటనే రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. కానీ దివ్యభారతి తీవ్రగాయాలతో కన్నుమూసింది. ఇక నీతా లల్లూలు దివ్యభారతి మరణం పై నోరువిప్పలేదు. అంతే కాకుండా దివ్యభారతి ప్రేమవివాహం చేసుకున్న ఆమె భర్త సాజిద్ నడియడ్ వాలా కూడా మౌనాన్నే ఆశ్రయించాడు. మరోవైపు దివ్యభారతి మరణించిన నెలరోజులకే ఆమె వంటమనిషి అమృత గుండె పోటుతో అనుమానాస్పదంగా మృతిచెందారు.
అంతే కాకుండా దివ్యభారతి మరణం వెనక మాఫియా డాన్ దావూద్ ఢీ గ్యాంగ్ కుట్ర ఉందనే ఆరోపణలు వినిపించాయి. దివ్యభారతి భర్త సాజిద్‌కు వారితో సంబంధాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. ముంబై పేలుళ్ల నుండి మీడియా,పోలీసులను దారిమళ్లించేందుకే ఇలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. కానీ పోలీసులు ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోవడంతో దివ్యభారతి మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. భారతీయ సినీ రంగంలో వెలగాల్సిన ఓ ధృవతార చిన్న వయస్సులోనే రాలిపోయింది.