టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు – మ్యాచోస్టార్ గోపీచంద్ కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. బాక్సాఫీస్ హీటెక్కిపోవాల్సిందే. గోపీచంద్ ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. మనోడు కెరీర్ స్టార్టింగ్‌లో జయం, నిజం లాంటి సినిమాల్లో విలన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మహేష్‌బాబు కెరర్‌లో బ్లాక్‌బస్టర్ ఒక్కడు. అసలు మహేష్‌కు కమర్షియల్‌గా తిరుగులేని సూపర్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సినిమా ఒక్కడు.
సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత ఎంఎస్. రాజు నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. భూమిక హీరోయిన్‌గా నటించగా సినిమాలో ఓబుల్‌రెడ్డి అనే విలన్ పాత్రను ప్రకాష్‌రాజ్ పోషించాడు. అసలు ఈ పాత్రను ఇప్పటకీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అయితే ఈ ఓబుల్‌రెడ్డి పాత్ర ముందుగా గోపీచంద్‌కే వచ్చిందట.
పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్లలో గోపీచందే ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. ఒక్కడు సినిమాలో విలన్ పాత్రను ముందుగా తననే చేయమని అడిగారని.. ఆ పాత్ర కోసం ప్రకాష్‌రాజ్‌ను అనుకున్నా ఆయన డేట్లు ఎడ్జెస్ట్ చేయలేకపోవడంతో దర్శకుడు గుణశేఖర్ ఓబుల్‌రెడ్డి పాత్ర చెప్పి చేయమన్నారని.. తనకు ఆ పాత్ర నచ్చడంతో తాను చేసేందుకు కూడా ఓకే చెప్పానని గోపీ తెలిపాడు.
అయితే ఈ పాత్రపై ఉన్న మక్కువతో వెంటనే ప్రకాష్‌రాజ్ డేట్లు సర్దుబాటు చేయడంతో మళ్లీ ప్రకాష్‌రాజ్‌ను తీసుకున్నారట. అలా ఆ సినిమాలో విలన్‌గా మహేష్‌బాబును ఢీ కొట్టే ఛాన్స్ మిస్ అయ్యిందని గోపీచంద్ తెలిపాడు. 2003 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిదో చూశాం. అయితే అదే సుమంత్ ఆర్ట్స్ బ్యానర్లో ప్రభాస్ వెంటనే వర్షం సినిమా చేశాడు. ఈ సినిమా 2004 సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్ అయ్యింది.
ఇక తాను నటించిన యజ్ఞం సినిమా గురించి కూడా గోపీచంద్ మాట్లాడాడు. ఈ సినిమా కథ నా కోసం రాసుకోలేదని.. ముందుగా ప్రభాస్‌కు వినిపించారని.. తర్వాత కళ్యాణ్‌రామ్ గారి దగ్గరకు వెళ్లింది. వాళ్లు చేయకపోవడంతో నా దగ్గరకు రావడం నేను చేయడం జరిగిపోయాయని గోపీ తెలిపాడు. ఇక రణం, లౌక్యం సినిమాల్లో కామెడీ ఎక్కువుగా ఉండడంతో ఆ సినిమాలు సూపర్ హిట్ అయినట్టు చెప్పాడు.