అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ కిడ్ అయిన జాన్వీ హిందీలో గొప్ప హీరోయిన్‌గా వెలగకపోయినా అడపాదడపా సినిమాలు చేస్తూ నెట్టుకొస్తుంది. అది కూడా తండ్రి బోనీకపూర్ బడా నిర్మాత కావడం, అలాగే, గాడ్ ఫాదర్‌గా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అండదండలు గట్టిగా ఉండటంతో హిందీ సీమలో బండి లాగించేస్తుంది.
అయితే, అక్కడ ఎన్ని సినిమాలు చేసినా కియారా అద్వానీ, రష్మిక మందన్న, పూజా హెగ్డే లాంటి వారు ఉండటంతో పైకి ఎగబాకలేకపోతోంది. బోనీకపూర్ కూడా జాన్వీని పెట్టి సినిమా నిర్మించాలంటే ధైర్యం చేయడం లేదనేది బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్స్. తమిళంలో హెచ్ వినోద్ – అజిత్ కాంబినేషన్‌లో బోనీ సినిమాలు నిర్మిస్తూ మంచి లాభాలను పొందుతున్నాడు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో టాలీవుడ్‌లో కూడా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమా హిట్ అయినా కూడా భారీ లాభాలను మాత్రం రాబట్టలేకపోయింది. అయితే, గత రెండేళ్ళుగా బోనీకపూర్ తన కూతుళ్ళని సౌత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ట్రై చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఇద్దరు కూతుళ్ళలో ఒక్కరికీ అవకాశం దక్కలేదు. గత ఏడాది త్రివిక్రం శ్రీనివాస్, ఎన్.టి.ఆర్ సినిమాలో జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారని ప్రచారం జరిగింది. తీరా చూస్తే కాంబినేషన్ మారింది.
కొరటాల దర్శకత్వంలో తారక్, త్రివిక్రం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు చేయబోతున్నారు. కానీ, హీరోయిన్ మాత్రం ఈ రెండు సినిమాలలో జాన్వీ కాకపోవడం షాకింగ్ విషయం.
అంటే మహేష్ సరసన గానీ, ఇటు తారక్ సరసన గానీ జాన్వీ సూటవదని మేకర్స్ భావించినట్టున్నారు. వాస్తవంగా శ్రీదేవికి తన కూతుళ్ళని బాలీవుడ్ కంటే కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీస్ మరీ ముఖ్యంగా తెలుగుకి పరిచయం చేయాలని ఆరాటపడేది.
కానీ, ఆ కల నెరవేరకుండానే కాలం చేసింది. మరి తల్లి కోరిక ఈ కూతుళ్ళు తీరుస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. టాక్ మాత్రం అందంలో నటనలో తల్లి రేంజ్ కాదని ఎప్పుడో జనాలు తేల్చి పారేశారు. దీనికి తోడు నటనలోనూ వీళ్లకు అంత సీన్ లేకపోవడం, భారీ రెమ్యునరేషన్లతో పాటు తమ టీంకు కూడా సకల సౌకర్యాలు సమకూర్చాలని గొంతెమ్మ కోర్కెలు కోరడం కూడా టాలీవుడ్ మేకర్స్‌కు వీళ్లంటే లైట్‌కు కారణమవుతున్నాయి.