నందమూరి నట సింహం బాలకృష్ణ తన సినిమా కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన సినిమాల్లో సమరసింహారెడ్డి ఒకటి. ఈ సినిమా తర్వాతే తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా ఫ్యాక్షన్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. ఈ సినిమాకు ముందు వరకు బాలయ్య వరుసగా ప్లాపుల్లో ఉన్నాడు. ఈ సినిమాతో హిట్ కాదు.. ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
సమరసింహారెడ్డి కథ ఎలా పుట్టింది ? అసలు ఈ సినిమా ఎలా ? పట్టాలు ఎక్కింది ? అన్నది చూస్తే చాలా ఆసక్తికర విషయాలే బయటకు వస్తాయి. ఈ సినిమా కోసం దర్శకుడు బి. గోపాల్ ఏకంగా 30 కథలు విన్నాకే ఇది ఓకే చేశారట. బి. గోపాల్‌కు ఎన్ని కథలు చెప్పినా నచ్చకపోవడంతో విజయేంద్రప్రసాద్‌కు చిరాకు వచ్చి ఆయనకు కథలు చెప్పడం మానేశారట. అయితే గోపాల్ చెప్పిన ఓ లైన్ మేరకు చివరగా ఓ కథ రెడీ చేద్దామనుకుని.. ఈ కథ రాశారట.
ఈ కథ విన్న బాలయ్య వెంటనే ఓకే చెప్పేశారట. అటు బి. గోపాల్‌కు కూడా పిచ్చగా నచ్చేసిందట. ఇక ఈ సినిమా నుంచే ముగ్గురు హీరోయిన్లను పెట్టే ట్రెండ్‌కు బాలయ్య శ్రీకారం చుట్టారు. ముందుగా సిమ్రాన్ పాత్ర కోసం రాశీని అనుకున్నారు. అయితే ఈ సినిమాలో ఉన్న సీతాకోక చిలుకతో పాటు కొన్ని రొమాంటిక్ సీన్లు చేసేందుకు రాశి ఒప్పుకోలేదు. దీంతో ఆమె ప్లేస్‌లో సిమ్రాన్‌ను తీసుకున్నారు. అలాగే బాలయ్య మేనకోడలి పాత్రలో సంఘవి, అజంలా ఝవేరిని కూడా హీరోయిన్లుగా తీసుకున్నారు.
1999 సంక్రాంతి కానుకగా జనవరి 13న వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. చిరంజీవి స్నేహంకోసం సినిమా కూడా సంక్రాంతికే వచ్చింది. అసలు ఈ సినిమా సాధించిన అప్రతిహత విజయంతో టాలీవుడ్‌కు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ సినిమాకు ఆ రోజుల్లోనే రు. 6 కోట్ల బడ్జెట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రు. 20 కోట్ల షేర్ రాబట్టింది. అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న సినిమాల రికార్డులను సమరసింహారెడ్డి తిరగరాసింది.
122 కేంద్రాల్లో 50 రోజులు – 77 కేంద్రాల్లో 100 రోజులు – 29 కేంద్రాల్లో 175 రోజులు – 3 థియేటర్లలో 227 రోజులు ఆడింది. బాలకృష్ణ పనైపోయిందన్న విమర్శలకు చెక్ పెడుతూ బాలయ్య ఓ రేంజ్‌లో నిలబెట్టిన సినిమా ఇది. ఆ తర్వాత నరసింహానాయుడు సినిమాతో మరోసారి బాలయ్య తన రికార్డులు తానే బ్రేక్ చేసుకున్నాడు.