మ్యాచో హీరో గోపీచంద్ – విలక్షణ దర్శకుడు మారుతి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మామూలుగా మిక్స్ డ్ టాకే వచ్చింది. సినిమాలో పెద్దగా కథ, కథనాలు లేవని.. మారుతి కామెడీ, గోపీచంద్ మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో సినిమాను చుట్టేశారనే అన్నారు. అయితే బాక్సాఫీస్ దగ్గర పోటీ సినిమాలు లేకపోవడంతో పాటు చాలా రోజుల తర్వాత మాస్ మెచ్చే యాక్షన్ సీన్లు ఉండడంతో పక్కా కమర్షియల్ ఫస్ట్ వీకెండ్ కే బాక్సాఫీస్ దగ్గర పాసైపోయింది.
ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్లో వచ్చిన వసూళ్లు.. సినిమాకు వచ్చిన టాక్‌ను బట్టి చూస్తే సంబంధమే లేదు. ఫస్ట్ డే పక్కా కమర్షియల్ రు. 6.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇది గోపీచంద్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫిగర్. ఇక శని, ఆదివారాలు కూడా బాగానే క్యాష్ చేసుకుంది. దీంతో ఈ సినిమా రెండు రోజులకు రు 10.5 కోట్లు , 3 రోజులకు రు. 15.2 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది.
మిక్స్ డ్ టాక్‌తో 3 రోజులకే బ్రేక్ ఈవెన్ కొట్టేసింది అంటే పక్కా కమర్షియల్ లాంగ్ రన్‌లో భారీలాభాలు సాధించే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. సెకండ్ వీకెండ్‌లోనూ ఈ సినిమాకు పోటీ సినిమాలు అయితే లేవు. ఈ లెక్కన చూస్తే రెండు వారాల పాటు బాక్సాఫీస్ దగ్గర పక్కా కమర్షియల్‌కు బ్రేకులు పడే ఛాన్సులు కనపడడం లేదు.
ఓవరాల్ గా ఈ సినిమాకు నిర్మాతలు పబ్లిసిటీ ఖర్చులతో కలుపుకుని దాదాపు రూ. 35 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అయితే డిజిటల్, శాటిలైట్, హిందీ రీమేక్ రైట్స్, డబ్బింగ్ హక్కులు కలుపుకుని నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే రు. 35 కోట్లు వచ్చాయి. ఇక ఇప్పుడు థియేట్రికల్ ఆదాయం కూడా గట్టిగానే వచ్చేలా ఉంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు ఈ సినిమా నిర్మించారు.