అన్నగారు.. ఎన్టీఆర్ ఆహార ప్రియులనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన సినీ రంగంలో ఉన్నా.. రాజకీయాల్లోకి వచ్చినా.. సమయానికి ఠంచనుగా ఆహారం తినేవారు. రోజుకు ఆయన 15 ఇడ్లీలు ఉదయం టిఫిన్‌లో తిన్నా కూడా మళ్లీ టైంకు భోజనం చేసేవారు. మధ్యాహ్న భోజనంలోనూ ఆయనకు మూడు, నాలుగు రకాల కూరలు ఉండేవి. మళ్లీ భోజనానంతరం కిళ్లీతో పాటు జ్యూస్‌లు కూడా తాగేవారు.
అదే సమయంలో స్వదేశీ ఆహారానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. ముఖ్యంగా.. నాటు రుచులకు ఆయన ఇష్టపడేవారు.
స్వయంగా ఇంటి నుంచి వచ్చిన ఆహారం అయితే.. లొట్టలేసుకుని మరీ తినేవారు. ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో మద్రాస్‌లో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కు ఇంటి నుంచే క్యారేజీ వచ్చేది. ఆయన తన ఇంటి రుచులను తోటి హీరోయిన్లు, నటీమణులకు రుచి చూపించేవారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన సతీమణి బసవ తారకం.. స్వయంగా వండి సచివాలయానికి క్యారేజీ తీసుకువెళ్లేవారు.
తర్వాత.. ఒక సందర్భంలో అన్నగారి రెండో సతీమణి.. లక్ష్మీపార్వతి కూడా.. ఇలానే ఇంటి నుంచి క్యారేజీ ని తీసుకువెళ్లారు. ఇలా..అన్నగారికి ఇంటి నుంచి వచ్చిన ఆహారం అంటే.. మహా ప్రీతి. అయితే.. ఈ ఆహారం విషయంలో అన్నగారికి సంబంధించి.. ఒక చర్చ ఎప్పుడూ తెరమీదికివచ్చేది.. అదే నాటు కోడి.. చేపలపులుసు. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన గురించిన చర్చ జరుగుతుం డేది. నాటి కోడి కూర కాకుండా.. ఏకంగా.. కోడి.. కోడిని ఆయన ఒక్కరే తినేవారని చర్చించుకునేవారు.
అయితే.. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఈ విషయంలో అనేకచర్చలు అయితే.. సాగేవి. ఉద యాన్నే సాధారణంగా.. కాఫీలు.. టీలు తాగే అలవాటు మెజారిటీ ప్రజలకు ఉంది. కానీ, అన్నగారు మాత్రం చద్దన్నం తినేవారని.. దానిలో నాటుకోడిని తినేవారని చెప్పుకొనేవారు. నాటుకోడిని కాల్చి.. ఫ్రై చేసి.. ఇస్తే.. ఇక, పూర్తిగా అన్నగారే లాగించేసేవారని అనేవారు. దీనికితోడు.. చెంబుడు చిక్కటి మజ్జిగ కూడా తీసుకునేవారని.. షూటింగుల మధ్యలో ప్రత్యేకంగా.. వెన్న తినేవారని.. చర్చ సాగేది. ఇలా.. అన్నగారి ఆహారం విషయంలో ఆసక్తికరమైన విషయాలు అనేకం ఇప్పటికీ చర్చకు వస్తూనే ఉన్నాయి.