టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సైలెంట్‌గానే తన పనులు చక్కపెట్టుకు పోతూ ఉంటాడు. అసలు మహేష్ ఏం చేసినా పెద్ద హడావిడి ఉండదు. మహేష్ ఇటు హీరోగా ఉండడమే కాదు.. తెరవెనక చాలా వ్యాపారాలు చేసుకుంటూ వెళుతున్నాడు. చాపకింద నీరులా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాడు. చాలా సైలెంట్‌గా హైదరాబాద్‌లో ఏషియన్ వాళ్లతో కలిసి ఏఎంబీ మాల్ కట్టేశాడు. ఇప్పుడు హైదరాబాద్‌కే ఏఎంబీ మాల్ తలమానికంగా మారింది.
అసలు ఏఎంబీ మాల్‌ను కొట్టే థియేటర్లే హైదరాబాద్‌లో లేవు. ఇక చాలా సైలెంట్‌గానే బ్యానర్ స్టార్ట్ చేసి మేజర్ సినిమా నిర్మించాడు. తన బ్యానర్లో మేజర్‌తో అదిరిపోయే మెమరబుల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇటీవలే అమెరికాలో ఆస్తులు కొనే పనిలో బిజీగా ఉన్న మహేష్‌బాబు కొద్ది రోజులుగా అక్కడే మకాం వేసి ఆస్తుల వెతికే పనిలో ఉన్నాడు. అందుకే తరచూ అమెరికా పర్యటనలకు కూడా వెళుతున్నాడు.
ఇక ఇప్పుడు మరో రెండు కొత్త బిజినెస్‌ల్లోకి కూడా మహేష్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. హైదరాబాద్‌లో సరికొత్త రుచులతో మాంచి రెస్టారెంట్ స్టార్ట్ చేయబోతున్నాడట. హైదరాబాద్‌లో మినర్వా రెస్టారెంట్లు చాలా ఫేమస్. ఇప్పుడు ఆ సంస్థతో కలిసి ఓ లగ్జరీ రెస్టారెంట్‌ను త్వరలోనే ప్రారంభిచే పనిలో మహేష్ బిజీగా ఉన్నాడు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఏపీ రాజధానికి కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడలో కూడా ఓ భారీ మాల్‌ను కట్టే ఆలోచనలో మహేష్ ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ రియల్ భూమ్ జోరుమీదున్నప్పుడే భారీగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు. కొన్ని ప్రాపర్టీస్ కూడా కొన్నాడు. అయితే 2019 తర్వాత ఇక్కడ రియల్ భూమ్ తగ్గిపోవడంతో సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు ధీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలన్న ఉద్దేశంతో విజయవాడ సిటీని ఆనుకునే భారీ మాల్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉన్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనూ పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం విజయవాడ పేరు చెపితే బెంజ్ సర్కిల్లో ఉన్న ట్రెండ్‌సెట్ మాల్, పీవీపీ మాల్ మాత్రమే ప్రముఖంగా ఉన్నాయి. ఇప్పుడు మహేష్ హైదరాబాద్ ఏఎంబీ మాల్ తరహాలోనే ఇక్కడ కూడా పెద్ద మాల్ కడితే విజయవాడకే తలమానికంగా ఉంటుందనడంలో సందేహం లేదు.