కరోనా దెబ్బతో గత రెండేళ్లుగా వాయిదా పడిన టాలీవుడ్ పెద్ద సినిమాలు అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతి నుంచి వరుస పెట్టి సమ్మర్ వరకు పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. పెద్ద సినిమాలు అయిపోవడంతో ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలు క్యూలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒకే వారం రెండు, మూడు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో అసలు చిక్కు వచ్చి పడింది.
జూలై నెలలో ఇప్పటికే పక్కా కమర్షియల్, ది వారియర్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు చైతు థ్యాంక్యూ, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ లైన్లో ఉన్నాయి. ఆగస్టు ఫస్ట్ వీక్‌లో ఏకంగా మూడు అంచనాలు ఉన్న మీడియం రేంజ్ హీరోల సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో కళ్యాణ్‌రామ్ బింబిసార – వైజయంతీ మూవీస్ సీతా రామం – నిఖిల్ కార్తీకేయ 2 లైన్లో ఉన్నాయి.
వాస్తవంగా నిఖిల్ కార్తీకేయ 2 ఈ నెల 22నే రావాల్సి ఉంది. అయితే చైతు థ్యాంక్యు సినిమాను సోలోగా రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ఒత్తిడి చేయడంతో కార్తీకేయ 2ను ఆగస్టు 5కు వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు నిఖిల్ సినిమా కోసం దిల్ రాజు బింబిసారను ఆగస్టు 5 కాకుండా మరో డేట్‌కు వాయిదా వేయాలని కళ్యాణ్‌రామ్‌ను రిక్వెస్ట్ చేసినట్టుగా సమాచారం. అయితే దిల్ రాజు రిక్వెస్ట్ చేసినా కళ్యాణ్‌రామ్ మాత్రం తన సినిమాను వాయిదా వేసుకునేందుకు ఇష్టపడలేదట.
కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో ఏకంగా రు. 37 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తీకేయ సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆ సినిమాకు సీక్వెల్‌గా కార్తీకేయ 2 వస్తోంది. ఈ సినిమా కూడా నిఖిల్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కింది. నిఖిల్ ముందుగా జూలై 22 ఫిక్స్ చేసుకుని చైతు కోసం తన డేట్ త్యాగం చేశాడు.
అయితే ఇప్పుడు ఆగస్టు 5ను ఎవ్వరూ వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆగస్టు 12న నితిన్ మాచర్ల నియోజకవర్గం ఉంది. ఆగస్ట్ 11న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ లాల్‌సింగ్ చద్దా ఉంది. పైగా చైతు ఈ సినిమాలో నటిస్తుండడంతో పాటు చిరంజీవి సమర్పిస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తి ఉంది. ఆగస్టు 2నే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ లైగర్ ఉంది. అందుకే ఈ డేట్‌ను వదులుకునేందుకు ఇష్టం లేకే కళ్యాణ్‌రామ్ దిల్ రాజు రిక్వెస్ట్‌ను తిరస్కరించాడట.