అన్నగారు ఎన్టీఆర్ సినిమా అనగానే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. ఆయన షూటింగ్ స్పాట్‌కు వస్తు న్నారంటే.. అదో పండగే. కొన్ని విలువలు.. కొన్ని పద్ధతులు ఆయన ఎప్పుడూ పాటించారు. ముఖ్యంగా సినీ రంగంలో చాలా మందికి ఉన్నట్టుగానే అన్నగారికి కూడా సెంటిమెంటు ఎక్కువగానే ఉండేది. ముహూర్తాలు, సెంటిమెంట్లను ఆయన బాగా నమ్మేవారు. తర్వాత ఆయన నుంచే ఈ అలవాట్లు అన్నీ ఆయన తనయుడు బాలకృష్ణకు కూడా వచ్చాయి.
ఈ క్రమంలో ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ బ్యానర్‌పై సినిమా స్టార్ట్ చేసినా.. ఒక సెంటిమెంటును ఖచ్చితంగా అమలు చేసేవారు. అదే.. ఆయన సొదరుడితో కొబ్బరికాయ కొట్టించడం. అన్నగారి సోదరుడు త్రివిక్రమరావు. ఆయన కూడా సినీ రంగంలోనే ఉండేవారు. అన్నగారి ప్రోత్సాహంతో నిర్మాతగా ఎదిగారు. వాస్తవానికి సోదరులు ఎక్కడ ఉన్నా.. వివాదాలు.. రగడ కామన్. ముఖ్యంగా ఆదాయం, ఆస్తుల విషయంలో సోదరుల మధ్య ఎక్కడా కెమిస్ట్రీ కుదరదనే టాక్ ఉంది.
కానీ, అన్నగారు-త్రివిక్రమ రావు విషయంలో మాత్రం రామలక్ష్మణులనే పేరు ఉండడం గమనార్హం. ఇద్దరూ కలిసిమెలిసి సినిమాలకు పనిచేసేవారు. ఈ క్రమంలోనే అన్నగారు ఎప్పుడు తన సినిమాను ప్రారంభించినా.. త్రివిక్రమరావుతోనే కొబ్బరికాయ కొట్టించేవారు. ఎన్టీఆర్‌కు తమ్ముడంటే పంచ ప్రాణాలు. మా గోల్డ్ బ్రదర్.. అని అన్నగారు ఆయనను సంబోధించేవారు. ఇక, అన్నగారి వెంట నడిచిన త్రివిక్రమరావు.. సైతం.. ఎన్టీఆర్ సినిమా వ్యవహారాలన్నీ చూసుకునేవారు.
ఎన్ఏటీ ( నేషనల్ ఆర్ట్స్ ) సంస్థను స్థాపించి.. ఆ బ్యానర్‌పై త్రివిక్రమరావు నిర్మాతగా అనేక సినిమాలు తీశారు. ఈ బ్యానర్‌లో వచ్చిన ప్రతి సినిమాకూడా సంగీత, సాహిత్యాల పరంగా.. దూసుకుపోయేవి. ముఖ్యంగా సంగీతాన్నిపర్యవేక్షించే బాధ్యతను త్రివిక్రమరావే చూసేవారు. ఎన్ ఏటీ బ్యానర్‌కు మరో విలక్షణ అలవాటు కూడా ఉంది. ఈ బ్యానర్‌లో నిర్మించే ఏ సినిమాలో అయితే.. తొలి కార్డు.. తల్లిదండ్రులను పూజించే సన్నివేశంతోనే ప్రారంభమయ్యేది.
ఎన్ ఏటీ లోగోలోనూ.. త్రివిక్రమరావు ఉండేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ ఆకస్మిక మరణంతో ఎన్ఏటీ బ్యానర్‌పై కాకుండా తన తనయుడు దివంగత రామకృష్ణ పేరు మీదుగా రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ నిర్మించి ఆ బ్యానర్‌పై సొంతంగా సినిమాలు నిర్మించారు. అలా అన్నగారితో ఎంతో సినీ అనుబంధం ఉన్న వ్యక్తిగా, సోదరుడిగా.. సెంటిమెంటుకు పెద్ద పీట వేసిన వ్యక్తిగా త్రివిక్రమరావు నిలిచిపోయారు.