కొన్నికొన్ని విషయాలు చాలా చిత్రంగా ఉంటాయి. అవి ప్రచారంలోకి వచ్చాక.. మరింత ఆసక్తిగా మారుతా యి. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు.. తెలుగు వారి అన్నగారు, ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కొన్ని చిత్రమైన విషయాలపై ఎక్కువగా ప్రచారం జరిగేది. ఆయన వస్త్రధారణ, నడవడిక, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం.. వంటి అనేక అంశాలపై చర్చ జరిగేది. అదే సమయంలో ఆహారం కూడా పెద్ద ఎత్తున సినీ నటుల మధ్య గుసగుస వినిపించేది.
ఇతర నటీనటులతో పోలుస్తూ.. ఎన్టీఆర్‌ను ఆటపట్టించేవారు. ఇలాంటి సందర్భాల్లోనే సీనియర్ నటుడు, హాస్యానికి పెద్ద పీట వేసిన రమణారెడ్డి విషయం కూడా చర్చకు వచ్చేది. రమణారెడ్డి షూటింగ్‌కు వస్తే.. టిఫెన్, టీ అక్కడే తీసుకునేవారు. ఇక, మిగిలిన వారు కూడా అక్కడే తిన్నా.. ఒకరిద్దరికి మాత్రం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి వారిలో అన్నగారు ఒకరు. గుండమ్మ కథ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన చిత్రమైన వ్యవహారం.. అన్నగారిని ఆటపట్టించింది.
ఈ సినిమాలో అచ్చు.. రైతు బిడ్డగానే కాకుండా.. అమాయక వ్యక్తిగా అన్నగారి నటన నభూతో నభవిష్యత్తు.. అన్నట్టుగా సాగింది. అయితే.. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా స్టూడియోలోనే సాగేది. ఇక్కడకే భోజనాలు.. టిఫిన్లు వచ్చేసేవి. దీనికి ముందే.,. ఏయే ఆర్టిస్టు ఏం తింటారనేది ముందుగానే ఫ్లోర్ మేనేజర్లకు లిస్టు వెళ్లిపోయేది. దీనిలో అన్నగారికి సంబందించిన ఐటంలు కొంచెం ఎక్కువగా ఉండేవి. ఓ సారి ఈ జాబితాను చూసిన రమణారెడ్డి.. “ఇదేందయ్యా ఇది.. తిండిపోతుకు రాసినట్టు రాసేరే!“ అని ప్రశ్నించారట.
అయితే.. ఈ విషయం అటు తిరిగి. ఇటు తిరిగి.. అన్నగారి చెవిలో పడింది. దీంతో ఆయన తాను తిండి పోతును కాదని.. ఆహార ప్రియుడినని చెప్పుకొచ్చారట. రమణారెడ్డికి.. అన్నగారికి మధ్య ఉన్న సాన్నిహి త్యంతో అరెయ్.. ఒరెయ్ అనుకునే చనువు కూడా ఉంది. ఈ నేపథ్యలోనే అన్నగారు.. తన ఆహార ప్రియత్వాన్ని వెల్లడించారని అంటారు. తనకు ఆహారం అంటే.. ఇష్టమని.. అయితే.. తాను 24 గంటలూ తింటూ కూర్చోనని చెప్పారట. ఈ విషయంపై చాలా రోజులు చర్చ కూడా నడించింది. తర్వాత రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు కూడా అన్నగారు ఆహార ప్రియులే తప్ప.. తిండిపోతుకాదని చెప్పడంతో ఈ గుసగుసకు తెరబడింది.